కమనీయం సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణం
కమనీయం సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణం
Published Wed, Sep 21 2016 12:57 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
చిట్టమూరు:మల్లాంలోని శ్రీ వళ్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవం మంగళవారం కమనీయంగా సాగింది. సోమవారం రాత్రి దేవేంద్రుడు, ఈశ్వరుడి మధ్య కల్యాణ రాయబారం జరగడం, సుబ్రహ్మణ్యేశ్వరుడికి దేవసేను ఇచ్చి వివాహం జరిపించేందుకు దేవేంద్రుడు ఒప్పుకున్న ఘట్టాల తర్వాత ఉదయం కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని నూరు కాళ్ల కల్యాణ మండపంలో దేవదేవేరుల ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి సర్వాంగసుందరంగా అలంకరించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా సాగింది. మయూర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ ప్రధాన అర్చకులు మూలం భానుప్రకాష్‌శర్మ, యాజ్ఞికులు ఆంజనేయశర్మ పర్యవేక్షణలో కల్యాణోత్సవ పూజలు జరిగాయి. మొదట శతస్తంభ కల్యాణ మండపాన్ని విశేష పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. పెద్దసంఖ్యలో భక్తులు తలరివచ్చి దేవుడి పెళ్లిని తిలకించారు. జిల్లా నలుమూలల నుంచే కాక తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో మల్లాం జనసంద్రంగా మారిం ది. కల్యాణ వేదిక పుష్పాలంకరణకు కత్తి మోహన్‌రావు, మాంగళ్య సామగ్రి సమర్పణకు చుట్టి రవి ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఏర్పాట్లను ఆలయ చైర్మన్ పాపారెడ్డి వెంకటసుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వూరు భారతి, ఈఓ రమణారెడ్డి పర్యవేక్షించారు.
భక్తులకు అన్నదానం
కల్యాణోత్సవానికి హాజరైన వేలాది మంది భక్తులకు మల్లాం మాజీ సర్పంచ్ దువ్వూరు శేషురెడ్డి, రామరాఘవరెడ్డి, రామలింగారెడ్డి ఆధ్వర్యం లో అన్నదానం జరిగింది.
Advertisement