
నర్సరీలోకి దూసుకొచ్చిన లారీ
లారీ డ్రైవర్ అజాగ్రత్త, నిద్రమత్తు ఇద్దరి బతుకులు నిద్రలోనే తెల్లారిపోయేలా చేసింది. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసేలా చేసింది.
- అదుపు తప్పిన లారీ
- ఘటనా స్థలంలో ఇద్దరు, చికిత్స పొందుతూ మరొకరు మృతి
- ఇంకొకరి పరిస్థితి విషమం
- లారీడ్రైవర్ నిర్లక్ష్యమే కారణం?
మియాపూర్: లారీ డ్రైవర్ అజాగ్రత్త, నిద్రమత్తు ఇద్దరి బతుకులు నిద్రలోనే తెల్లారిపోయేలా చేసింది. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసేలా చేసింది. వీరంతా తూర్పుగోదావరి జిల్లా నుంచి పొట్టచేతపట్టుకుని వ్యాపారం నిమిత్తం వచ్చిన వారే. సోమవారం తెల్లవారుజామున మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది.
సీఐ రమేష్ కొత్వాల్ కథనం ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం, కోరుమిల్లి గ్రామానికి చెందిన ఆదిబాబు (30), చీకట్ల శ్రీనివాస్ (30), చీకట్ల కృష్ణమూర్తి, చీకట్ల సురేష్ మొక్కల వ్యాపారులు. ఆ జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ రకాలైన మొక్కలు కొనితెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తుంటారు. పది రోజుల క్రితం మొక్కల లోడ్‌తో వచ్చిన ఈ నలుగురూ 9వ నెంబర్ జాతీయ రహదారిపై మియాపూర్‌లోని మదీనాగూడ ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో తాత్కాలిక నర్సరీ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులోనే రేకుల డబ్బా ఏర్పాటు చేసుకుని బస చేస్తున్నారు. పగలంతా వ్యాపారం చేసి, రాత్రి వేళ ఆ డబ్బాలోనే నిద్రిస్తున్నారు.
రోజూ మాదిరిగానే ఆదివారం రాత్రి డబ్బాలోనే పడుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు లారీ రూపంలో మృత్యువు వీరి పైకి దూసుకొచ్చింది. ఉప్పులోడుతో మియాపూర్ నుంచి చందానగర్ వైపు వెళ్తున్న లారీ (ఏటీటీ 1517) మదీనాగూడ ఆంజనేయస్వామి గుడి సమీపంలో అదుపు తప్పింది. తెల్లవారుజాము కావడం.. లారీ మితిమీరిన వేగంతో ఉండటంతో పాటు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో అదుపు తప్పింది. రోడ్డు పక్కనే ఉన్న తాత్కాలిక నర్సరీలోకి దూసుకుపోయింది. లారీ వేగానికి డబ్బా ఛిద్రమైంది. అందులో నిద్రపోతున్న ఆదిబాబు, శ్రీనివాస్ లారీ చక్రాల కింద నలిగి అక్కడికక్కడే చనిపోయారు.
కృష్ణమూర్తి, సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కృష్ణమూర్తి మృతి చెందగా... సురేష్ పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ లారీ దిగి పారిపోయారు. ఈ ప్రమాదంపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణం కావచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనం కూడా ధ్వంసమైంది. మూడు మృతదేహాలకూ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు.