
మధుప్రియ పెళ్లైపోయింది
బెజ్జూరు (ఆదిలాబాద్) : నాటకీయ పరిణామాల మధ్య వర్ధమాన గాయని మధుప్రియ వివాహం శుక్రవారం మధ్యాహ్నం వైభవంగా జరిగింది. కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన వయసులో అప్పుడే పెళ్లి చేసుకోవడం సరికాదని మధుప్రియ తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. ఆఖరికి తమ పెళ్లి రోజైన నవంబర్ 18న పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు ప్రాధేయపడినా మధుప్రియ ఒప్పుకోలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు.
ముందు నుంచి ఏర్పాటు చేసుకున్న ప్రకారమే సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని వాసవీ గార్డెన్స్‌లో తన అభీష్టం మేరకు ప్రియుడు శ్రీకాంత్ను ఆమె వివాహం చేసుకుంది. పెళ్లికొడుకు తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో వివాహం జరిగింది. అనూహ్య మలుపులతో ప్రేమ వ్యవహారం ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కడంతో శుక్రవారం ఉదయం నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెర పడినట్లయింది.