♦ నాడు వెల్కటూర్ లో.. నేడు రాంపూర్‌లో
♦ మాఫియాకు అడ్డాగా మారుతున్న నంగునూరు
♦ పీస్‌జోన్ కావడంతో అక్రమార్కుల కన్ను
♦ సెటిల్‌మెంట్లు, భారీ దోపిడీలే లక్ష్యంగా అద్దెకు
నంగునూరు: మూడు నెలల క్రితం వెల్కటూర్‌లో ఒక వ్యక్తి ఇంట్లో నుంచి పోలీసులు తుపాకీ స్వాధీనం చేసుకోగా తాజాగా రాంపూర్ వద్ద మూడు తుపాకులు లభించడం మండలంలో కలకలం రేపుతోంది. మండలం మారుమూల ప్రాంతం కావడంతో పాటు రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ పీస్ జోన్‌లో ఉండడంతో మాఫియాకు అడ్డాగా మారుతోంది. శనివారం రాత్రి రాంపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తులు రెండు తుపాకులు, ఒక తపంచాతో పట్టుబడిన విషయం తెలిసిందే. వీరు ఎదైనా దోపిడీ ముఠా సభ్యులా.. లేక మాఫియా గ్యాంగ్‌కు చెందిన వారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనలో పోలీసులను చూసి ముగ్గురు పారిపోగా ఒక వ్యక్తి పెద్ద బ్యాగ్ భుజానికి వేసుకొని పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎక్కడో సెటిల్‌మెంట్ చేసి భారీగా వచ్చిన డబ్బుల పంపకాల విషయంలో తేడాలు రావడంతో దాడులు చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్క జిల్లాకు చెందిన ఒక వ్యక్తి, మండలానికి చెందిన మరో వ్యక్తితో కలసి దుబాయికి తీసుకెళ్తామని కొందరి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూల్ చేసినట్లు వినికిడి. విదేశాలకు పంపించాలని డబ్బులు ఇచ్చిన వ్యక్తులు ఒత్తిడి చేయడంతో వారిని బెదిరించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ జిల్లా వారణాసి ప్రాంతానికి చెందిన కిరాయి హంతకులను ఇక్కడికి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. దుండగులు హన్మకొండ ప్రధాన రహదారిపై రాంపూర్ క్రాస్‌రోడ్డు వద్ద గతంలో దాబా హోటల్ నడిచిన ఇంట్లో పది రోజులుగా బస చేస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నా ఎవ్వరికి అనుమానం రాకపోవడం గమనార్హం.
నాడు వెల్కటూర్.. నేడు రాంపూర్
మండలం సిద్దిపేట పట్టణానికి సమీపంలో ఉన్నప్పటికీ మారుమూల ప్రాంతం కావడంతో నిఘా తక్కువగా ఉంటోంది. ఇదే కాకుండా రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో క్రైం శాతం తక్కువగా ఉండడం, పీస్ జోన్ కింద ఈ ప్రాంతం ఉండడంతో మాఫియా, ల్యాండ్ సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ నెలలో వెల్కటూర్‌కు చెందిన బత్తిని వెంకటస్వామి ఇంట్లో పో లీసులు సోదాలు చేసి తుపాకీ స్వాధీనం చేసుకొని అతడిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి నెలలో లారీలో తరలిస్తున్న రెండు వందల క్వింటాళ్ల గంజాయిని రాజగోపాల్‌పేట ఎస్‌ఐ గోపాల్‌రావు పట్టుకున్న విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నుంచి జిల్లాలోని రాజగోపాల్‌పేట వరకు ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్ లేకపోవడంతో నిఘా తక్కువగా ఉంటోంది. దీంతో అసాంఘీక కార్యకలాపాలకు మండలం అనువుగా మారింది. అలాగే ఈప్రాంతం లో నాలుగు దాబా హోటళ్లు ఉండడం మద్యం, భో జనాలు లభించడంతో అక్రమార్కులకు అడ్డాగా మారింది.