బేతోలు మైసమ్మకుంట కబ్జాకు యత్నం | Maisammakunta attempt to aggression | Sakshi
Sakshi News home page

బేతోలు మైసమ్మకుంట కబ్జాకు యత్నం

Published Sun, Jul 24 2016 8:09 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

బేతోలు హైవేపై రాస్తారోకో చేస్తున్న గిరిజనులు, నాయకులు

బేతోలు హైవేపై రాస్తారోకో చేస్తున్న గిరిజనులు, నాయకులు

  • అడ్డుకోబోయిన రైతు గుగులోతు శ్రీనుపై దాడి
  • దాడికి నిరసనగా రాస్తారోకోకు దిగిన గిరిజనులు
  • మద్దతుగా నిలిచిన ఎల్‌హెచ్‌పీఎస్, వివిధ రాజకీయ పార్టీలు
  • ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ మద్దతుతో భూకబ్జాకు యత్నించారంటూ ఆరోపణ
  • మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ మండలం బేతోలు గ్రామశివారులోగల మైసమ్మకుంట చెరువు కట్టను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు కబ్జా చేసేందుకు యత్నించారు. వారిని గుగులోత్‌ శ్రీను అనే రైతు అడ్డుకోపోగా వారు అతడిపై దాడికి యత్నించారు. ఈ ఘటన ఆదివారం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. బాధిత రైతు కథనం ప్రకారం.. బేతోలు గ్రామశివారులో మైసమ్మకుంట చెరువు ఉంది.
     
    ఈ చెరువుపై ఆధారపడి పలువురు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఈ చెరువు భూమిపై రియల్టర్ల కన్ను పడింది. ఈ క్రమంలో శనివారం రాత్రి  గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు దార యాదగిరిరావు, మల్యాల శ్రీనివాసరావు, నెల్లూరి శ్రీధర్, వెంకన్న, మధు, ఖమ్మంకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బొందాలు, మరికొంతమంది కలిసి రైతు గుగులోత్‌ శ్రీనును రాత్రి 11 గంటల సమయంలో మద్యం తాగు అంటూ పోశారు. నెమ్మదిగా వారు మైసమ్మ చెరువు కుంట ప్రస్తావన తీసుకురావడంతో  తాను మద్యం తాగనని, మైసమ్మ చెరువు కుంటను కబ్జా చేస్తారా అని ప్రశ్నించాడు. చెరువు కట్టను తొలగించాలని చూస్తే ఊరుకోనని చెప్పాడు.
     
    అందుకు వారు భూమిని ప్లాట్లుగా చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తే బాగా డిమాండ్‌ వస్తుందన్నారు. ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌తో కూడా చెప్పామని, నువ్వు వినకుంటే ఏం చేయడానికైనా సిద్ధమేనని వారు హెచ్చరించారు. తన భూమిని గుంజుకుంటామని చెప్పడంతో అందుకు శ్రీను ఒప్పుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోగా వారంతా మైసమ్మకుంట చెరువు కట్టపైకి వచ్చి ప్రొక్లయినర్‌ సాయంతో చెరువు కట్ట తొలగించే పని ప్రారంభించారు. ఈ పనిని అపేందుకు శ్రీను వెళ్లగా అతడిపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. వెంటనే భయాందోళనకు గురైన శ్రీను అక్కడి నుంచి పారిపోయి ఉదయాన్నే అందరికి చెప్పాడు. 
     
     
    విషయం తెలుసుకున్న గిరిజనులు ఆదివారం ఉదయాన్నే మహబూబాబాద్, కురవి ప్రధాన రహదారి అయిన బేతోలు హైవేపై రాస్తారోకోకు దిగారు. వారి ఆందోళనకు ఎల్‌హెచ్‌పీఎస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతుగా నిలిచారు. రాస్తారోకోతో రెండువైపులా వాహనాలు చాలా దూరం వరకు నిలిచిపోయాయి. ఆయా పార్టీల నాయకులు గుగులోత్‌ భీమానాయక్, ముల్లంగి ప్రతాప్‌రెడ్డి, గునిగంటి రాజన్న, రేషపల్లి నవీన్‌ మాట్లాడుతూ మైసమ్మకుంట చెరువు కట్ట కూల్చివేతకు, ఆక్రమించేందుకు యత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఆయన అనుచరులు ఈ పనికి పూనుకున్నారని వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. భూకబ్జాలకు పాల్పడేవారిని ఉపేక్షించొద్దన్నారు. కురవి ఎస్సై రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడినప్పటికి వారు రెవెన్యూ అధికారులు రావాలని, శ్రీనుపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ కూర్చున్నారు.
     
    సివిల్‌ సప్లై డీటీ మాధవపెద్ది వెంకట్‌రెడ్డి, ఆర్‌ఐ జర్పుల సుధాకర్‌ నాయక్, సర్వేయర్‌ విజయభాస్కర్‌ రాస్తారోకో వద్దకు వచ్చారు. ఆందోళన కారులతో మాట్లాడారు. రైతులు ఫిర్యాదు చేస్తే సంఘటనకు బాధ్యులైన వారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసేందుకు ఆదేశిస్తామని డీటీ వెంకట్‌రెడ్డి చెప్పారు. అంతేగాక  ప్రొక్లయినర్‌ను సీజ్‌ చేస్తామని, తిరిగి మైసమ్మకుంట భూమిని సర్వే చేయిస్తామని తెలిపారు. దీంతో ఆందోళనకారులు రాస్తారోకోను విరమించారు.
    ఆరుగురిపై కేసు నమోదు 
    బేతోలు గ్రామ శివారులోని మైసమ్మకుంట చెరువు కట్టను ధ్వంసం చేసిన విషయంలో రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెరువు కట్టను తవ్వారని దార యాదగిరిరావు, నెల్లూరి శ్రీధర్, వెంకన్న, కె మధు, మల్యాల శ్రీనివాసరావు, రామయ్యపైకేసు నమోదు చేశామని కురవి ఎస్సై రామకృష్ణ తెలిపారు.
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement