mla shankar naik
-
మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాస్ వార్నింగ్
-
ఎమ్మెల్యే శంకర్‌నాయకే ఇదంతా చేయించారు: రవి భార్య పూజ
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణంలోని బాబూనాయక్‌తండాకు చెందిన 8వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోత్ రవినాయక్ (34) హత్య వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన భర్త ఇండిపెండెంట్‌గా గెలిచారని, ఆ తరువాత టీఆర్ఎస్లో చేరారని, రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేకనే హత్య చేశారని పోలీసులకు మృతుడి భార్య ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయకే తన అనుచరులతో ఈ హత్య చేయించారని రవినాయక్ తల్లి లక్ష్మి, భార్య పూజ ఆరోపించారు. చదవండి👉🏾 ఏసీబీ వలలో శేరిలింగంపల్లి టీపీవో కాగా, మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి వచ్చిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తోపాటు పలువురు నాయకులను మృతుడి బంధువులు అడ్డుకున్నారు. ఘటనపై ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ రవినాయక్ హత్య దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఏఐసీసీ ఆదివాసీ విభాగం జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్యనాయక్, బీజేపీ గిరిజనమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్‌నాయక్ ఆస్పత్రికి చేరుకుని హత్యోదంతంపై ఆరా తీశారు. చదవండి👉🏾 మహబూబాబాద్‌లో పట్టపగలు టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణహత్య -
కలెక్టర్‌కు మద్దతుగా ఆందోళనలు
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కలెక్టర్ ప్రీతిమీనాకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ సారీ చెప్పినప్పటికీ వివాదం సద్దుమనగడం లేదు. రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన విరమించినా.. పొలిటికల్ పార్టీలు మాత్రం తమ ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. కలెక్టర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, న్యూ డెమోక్రసీ , ఎమ్మార్పీఎస్, మహిళ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకోలు చేసి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు -
ఎమ్మెల్యే శంకర్ నాయక్ అరెస్ట్.. బెయిల్‌పై విడుదల
మహబూబాబాద్: జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌ను స్థానిక పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అనంతరం ఎమ్మెల్యే సొంత పూచీకత్తుపై బెయిల్ పై విడుదలయ్యారు. తన సొంత వాహనంలోనే మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యేపై ప్రాథమిక విచారణ అనంతరం బెయిల్ పై ఆయనను విడుదల చేశారు. కాగా, సెక్షన్ 353, 354 కింద శంకర్‌నాయక్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ అధికారి విధులను అడ్డుకున్నందుకు 353 సెక్షన్, ఒక మహిళ పట్ల నేరపూరితమైన ఆలోచనతో దాడి చేసినందుకు 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రీతి మీనాతో అనుచితంగా ప్రవర్తించారంటూ తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన ఎమ్మెల్యే శంకర్ నాయక్.. పొరపాటున చేయి తగిలి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందాక చార్జిషీటు: ఎస్పీ కోటిరెడ్డి 'ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అనుచిత ప్రవర్తనపై 230/2017, యు/ఎస్ 353, 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఈ కేసులో విచారణాధికారిగా తొర్రుర్ డీఎస్పీ రాజరత్నంను నియమించాం. నేటి ఉదయం ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నాం. విచారణ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశాం. కేసుకు సంబంధించి ఫొటోలు, వీడియోను ఎఫ్ఎస్ఎల్కు పంపించాం. ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందిన తర్వాత కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేస్తామని' ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఏం జరిగిందంటే.. మహబూబాబాద్‌లో బుధవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జిల్లా కలెక్టర్ ప్రీతి మీనాలు పాల్గొన్నారు. హారితహారం కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో నేతలు, అధికారులు మొక్కలు నాటారు. అనంతరం వేదిక మీదకు వెళ్లే సమయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ ప్రీతిమీనా చేయిపట్టుకొని ముందుకు లాగగా ఆమె ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రజా ప్రతినిధి తనను చేయి పట్టుకొని అనాగరికంగా వ్యవహరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కలెక్టర్ ప్రతీమీనా.. మహిళనైన తనను చేయితో తాకాల్సిన అవసరం ఏముందంటూ ఆగ్రహించారు. ఈ అవమానంపై కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్యే శంకర్ కేసుపై చర్చ
-
శంకర్‌దాదా.. ఇదేం మర్యాద?
- మహిళా కలెక్టర్‌తో ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తన - మానుకోట ఎమ్మెల్యే తన చేయి పట్టుకోవడంతో నిర్ఘాంతపోయిన ప్రీతిమీనా - ‘బీ ఇన్ యువర్ లిమిట్..’ అంటూ తీవ్ర హెచ్చరిక - ఐఏఎస్‌ల సంఘం, సీఎస్‌తోపాటు పోలీసులకూ ఫిర్యాదు - మహబూబాబాద్ కలెక్టర్‌కు ఉద్యోగుల బాసట - నల్లబ్యాడ్జీలతో నిరసన.. చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ - ఎమ్మెల్యే తీరుపై సీఎం కేసీఆర్ మండిపాటు - తక్షణమే బేషరతుగా క్షమాపణలు కోరాలని ఆదేశం - కలెక్టర్‌కు ఫోన్ చేసి సముదాయించిన డిప్యూటీ సీఎం కడియం - పొరపాటున చేయి తగిలి ఉంటే క్షమాపణలు కోరుతున్నా: ఎమ్మెల్యే సాక్షి, మహబూబాబాద్/హైదరాబాద్ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనాకు తీవ్ర అవమానం జరిగింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కలెక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించారు. చేయి పట్టుకొని అనాగరికంగా వ్యవహరించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కలెక్టర్‌ను, పైగా మహిళనైన తనను చేయితో తాకాల్సిన అవసరం ఏముందంటూ ఆమె ఆగ్రహించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అవమానంపై కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. అటు ఐఏఎస్ అధికారుల సంఘం కూడా దీన్ని తీవ్రంగా పరిగణించింది. అసోసియేషన్ తరఫున వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు సీఎస్‌ను కలసి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే తీరుపై ఉద్యోగ సంఘాలూ మండిపడుతున్నాయి. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా అధికారులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే గురువారం ఉద్యోగాలకు హాజరుకాబోమని కలెక్టరేట్ ఉద్యోగులు హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రవర్తనపై ముఖ్యమంత్రి కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన ఆదేశంతో శంకర్ నాయక్.. కలెక్టర్‌ను కలసి క్షమాపణలు కోరారు. జిల్లాస్థాయి అధికారులతో కూడా ఎమ్మెల్యే అమర్యాదగా మాట్లాడతారని ఈ సందర్భంగా పలువురు వాపోయారు. 1988లో పంజాబ్‌లో నాటి డీజీపీ కేపీఎస్ గిల్.. ఓ సమావేశంలో ఐఏఎస్ అధికారి రూపన్ డియోల్ బజాజ్‌తో ఇలాగే అమర్యాదగా ప్రవర్తించినందుకు ఆమె సుప్రీంకోర్టు దాకా వెళ్లారని, చివరికి గిల్‌ను కోర్టు తీవ్రంగా తప్పుపట్టిందని అధికారులు గుర్తుచేస్తున్నారు. గిల్‌కు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయని పేర్కొంటున్నారు. ఐ యామ్ కలెక్టర్.. బీ ఇన్ యువర్ లిమిట్! హరితహారం మూడోవిడత కార్యక్రమాన్ని మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం ఆవరణలో బుధవారం మంత్రి చందూలాల్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, కలెక్టర్ ప్రీతిమీనా, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అంతా కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటడం పూర్తయ్యాక స్టేజీ వద్దకు వచ్చే సమయంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కలెక్టర్ ప్రీతి మీనా చేయి పట్టుకొని ముందుకు పదండని అన్నారు. దీంతో ఆమె నిర్ఘాంతపోయారు. అక్కడే ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ‘ఐ యామ్ కలెక్టర్.. బీ ఇన్ యువర్ లిమిట్’అంటూ హెచ్చరించారు. అక్కడ్నుంచి సభావేదికపైకి వెళ్లారు. సభ ముగిసేంత వరకు మిన్నకుండిపోయారు. కార్యక్రమం ముగియగానే జేసీ దామోదర్‌రెడ్డి, డీపీఆర్ఓ ఆయూబ్ అలీని పిలిచి ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్, ఐఏఎస్‌ల సంఘానికి ఫిర్యాదు అనంతరం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. తన చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై సరైన ఆధారాలతో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. మీడియాలో తీసిన ఫొటోలు, వీడియో క్లిప్పింగుల కోసం ఆరా తీశారు. ఎమ్మెల్యే తన చేయిపట్టుకున్న ఫొటోలను సంపాదించి.. ఐఏఎస్‌ల సంఘానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీని కూడా పిలిచి, ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తానని చెప్పినట్టు సమాచారం. ఈ లోపు విషయం దావానలంలా వ్యాపించడంతో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్ వారందరితో సమావేశమయ్యారు. చివరకు అధికారులంతా నల్లబ్యాడ్జీలతో బయటకు వచ్చారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి బీపీ ఆచార్య ఆధ్వర్యంలో ఐఏఎస్ అఫీసర్స్ అసోసియేషన్ అత్యవసరంగా సమావేశమై ఈ ఘటనను ఖండించింది. కలెక్టర్‌కే ఇలా జరిగిందంటే సాధారణ ఉద్యోగుల పరిస్థితేమిటని సచివాలయంలో పలువురు అధికారులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సీరియస్.. కలెక్టర్ ప్రీతి మీనాపై ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించిన ఘటనపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తననెంతో ఆవేదనకు గురిచేసిందన్నారు. కలెక్టర్‌ను వ్యక్తిగతంగా కలిసి భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. శంకర్‌నాయక్ తన ప్రవర్తనను మార్చుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కలెక్టర్‌తో మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ సీతారాం నాయక్‌లను ఆదేశించారు. ప్రభుత్వం, పార్టీ తరఫున కలెక్టర్‌తో మాట్లాడి సముదాయించాలని సూచించారు. సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కలెక్టర్ ప్రీతి మీనాతో మాట్లాడారు. జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేసి సముదాయించేందుకు ప్రయత్నించారు. వెంటనే వెళ్లి కలెక్టర్‌ను క్షమాపణ కోరాలంటూ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి హెచ్చరించారు. మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్ సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆమెతో చర్చించారు. దాదాపు గంటపాటు చర్చించిన అనంతరం ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను పిలిపించి కలెక్టర్‌కు క్షమాపణలు చెప్పించారు. చేయి తగిలి ఉంటే క్షమాపణలు కోరుతున్నా: శంకర్‌నాయక్, ఎమ్మెల్యే ‘జిల్లా కలెక్టర్ నాకు సొదరిలాంటిది. కలెక్టర్ అంటే చాలా గౌరవం ఉంది. నేను ఎస్టీ వర్గానికి చెందినవాడిని. ఆమె కూడా ఎస్టీ వర్గానికి చెందినదే. నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఒకవేళ జనంలో పొరపాటున చేయి తగిలి ఉంటే, క్షమాపణలు కోరుతున్నా’అని వివరణ ఇచ్చినట్లు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఉద్యోగుల్లో, ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కలెక్టర్ చేయిని కావాలనే పట్టుకొని... ఇప్పుడు ‘పొరపాటున తగిలి ఉంటే..’అంటారా అని ఆగ్రహం వ్యక్తచేస్తున్నారు. ఎన్నోసార్లు కంటతడి పెట్టిన కలెక్టర్! ఎమ్మెల్యే శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ప్రీతిమీనాతో గతంలో పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించినట్లు జిల్లాకు చెందిన ముఖ్య అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పలు సందర్భాల్లో చేతులతో తాకడం, దురుసుగా మాట్లాడడం, పలుమార్లు దుర్భాషలాడినట్లు తెలిపారు. దీంతో జిల్లా కలెక్టర్ సీనియర్ అధికారుల వద్ద ఎమ్మెల్యే తీరుపై పలుమార్లు కంటతడి కూడా పెట్టుకున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే కావడంతో ఏం చేయలేక, చూసీచూడనట్లు వ్యవహరించినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే వైఖరిపై కలెక్టర్ ఆరు నెలల క్రితమే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా స్థాయి అధికారులతో కూడా ఎమ్మెల్యే అమర్యాదగా మాట్లాడుతారని పలువురు అధికారులు చెబుతున్నారు. రారా, పోరా, వాడు, వీడు అని వ్యాఖ్యానించినా ఏం చేయలేక, మౌనంగా ఉంటున్నామని అధికారులు వాపోతున్నారు. వివాదాస్పదంగా ఎమ్మెల్యేల తీరు.. ఐఏఎస్ అధికారిపై ఎమ్మెల్యే దురుసుగా వ్యవహరించిన సంఘటన ఇటు ప్రభుత్వాన్ని, అటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కలవరపరిచింది. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ గతంలోనూ ఒక భూమి విషయంలో స్థానిక మహిళా తహశీల్దార్‌ను ఇంటికి పిలిపించి దుర్భాషలాడినట్టు ఫిర్యాదులున్నాయి. ఇప్పుడు ఏకంగా కలెక్టర్‌కు చేదు అనుభవం ఎదురవటంతో అధికార పార్టీ ఎమ్మెల్యే తీరు అందరి నోటా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రొటోకాల్ పాటించలేదంటూ అక్కడి మహిళా కలెక్టర్‌పై ఇటీవలే దుందుడుకుగా వ్యవహరించారు. సీడ్ బాల్ బాంబింగ్ కార్యక్రమానికి తనను పిలవలేదంటూ గదమాయించారు. ఈ వరుస ఘటనలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినవే కావటం గమనార్హం. -
కలెక్టర్ కు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే
మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ వార్నింగ్‌లో ఎట్టకేలకు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దిగొచ్చారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ప్రీతి మీనాకు ఆయన రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తన వల్ల జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పానని, కలెక్టర్ తనకు సోదరిలాంటిదన్నారు. అనుకోకుండా తన చేయి తాకిందని ఆయన తెలిపారు. కాగా తనతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ దురుసుగా ప్రవర్తించారంటూ కలెక్టర్ ప్రీతి మీనా ఇవాళ ఐఏఎస్‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సీరియస్ అయ్యారు. తక్షణమే కలెక్టర్‌కు స్వయంగా క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి... కలెక్టర్‌తో మాట్లాడారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత వార్త... ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ వార్నింగ్ -
ఎమ్మెల్యేకు కేసీఆర్ సీరియస్ వార్నింగ్
హైదరాబాద్ : జిల్లా కలెక్టర్ పట్ల మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన కేసీఆర్... ప్రవర్తన సరిగా లేదంటూ ఎమ్మెల్యేను తీవ్రస్థాయిలో మందలించారు. కలెక్టర్‌ను వ్యక్తిగతంగా కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను సీఎం ఆదేశించారు. ప్రవర్తన మార్చుకోకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వస్తుందని కేసీఆర్ హెచ్చిరించారు. మహిళల పట్ల ఎవరు దురుసుగా ప్రవర్తించినా సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. అలాగే కలెక్టర్ ప్రీతిమీనాతో... ప్రభుత్వం తరఫున మాట్లాడి సముదాయించాలని కేసీఆర్ ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ సీతారాం నాయక్‌లను సూచించారు. CM KCR strongly admonished Mahbubabad MLA Shankar Naik's improper behaviour with District Collector. Expressed regret over the incident — Telangana CMO (@TelanganaCMO) 12 July 2017 Hon'ble CM has asked the MLA to tender an unconditional apology to the District Collector in person — Telangana CMO (@TelanganaCMO) 12 July 2017 కాగా ఎమ్మెల్యే తనతో అసభ్యంగా ప్రవర్తించారని కలెక్టర్ ప్రీతి మీనా .. ఐఏఎస్‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్‌లో ఇవాళ చేపట్టిన మూడో విడత హరితహారం కార్యక్రమంలో ఇద్దరి మధ్య వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు అమర్యాదగా ప్రవర్తించిన ఎమ్మెల్యే తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుంటే తాము గురువారం విధులకు హాజరు అయ్యేది లేదని హెచ్చరించారు. -
బేతోలు మైసమ్మకుంట కబ్జాకు యత్నం
అడ్డుకోబోయిన రైతు గుగులోతు శ్రీనుపై దాడి దాడికి నిరసనగా రాస్తారోకోకు దిగిన గిరిజనులు మద్దతుగా నిలిచిన ఎల్‌హెచ్‌పీఎస్, వివిధ రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మద్దతుతో భూకబ్జాకు యత్నించారంటూ ఆరోపణ మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం బేతోలు గ్రామశివారులోగల మైసమ్మకుంట చెరువు కట్టను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొందరు టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసేందుకు యత్నించారు. వారిని గుగులోత్ శ్రీను అనే రైతు అడ్డుకోపోగా వారు అతడిపై దాడికి యత్నించారు. ఈ ఘటన ఆదివారం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. బాధిత రైతు కథనం ప్రకారం.. బేతోలు గ్రామశివారులో మైసమ్మకుంట చెరువు ఉంది. ఈ చెరువుపై ఆధారపడి పలువురు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఈ చెరువు భూమిపై రియల్టర్ల కన్ను పడింది. ఈ క్రమంలో శనివారం రాత్రి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు దార యాదగిరిరావు, మల్యాల శ్రీనివాసరావు, నెల్లూరి శ్రీధర్, వెంకన్న, మధు, ఖమ్మంకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బొందాలు, మరికొంతమంది కలిసి రైతు గుగులోత్ శ్రీనును రాత్రి 11 గంటల సమయంలో మద్యం తాగు అంటూ పోశారు. నెమ్మదిగా వారు మైసమ్మ చెరువు కుంట ప్రస్తావన తీసుకురావడంతో తాను మద్యం తాగనని, మైసమ్మ చెరువు కుంటను కబ్జా చేస్తారా అని ప్రశ్నించాడు. చెరువు కట్టను తొలగించాలని చూస్తే ఊరుకోనని చెప్పాడు. అందుకు వారు భూమిని ప్లాట్లుగా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే బాగా డిమాండ్ వస్తుందన్నారు. ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌తో కూడా చెప్పామని, నువ్వు వినకుంటే ఏం చేయడానికైనా సిద్ధమేనని వారు హెచ్చరించారు. తన భూమిని గుంజుకుంటామని చెప్పడంతో అందుకు శ్రీను ఒప్పుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోగా వారంతా మైసమ్మకుంట చెరువు కట్టపైకి వచ్చి ప్రొక్లయినర్ సాయంతో చెరువు కట్ట తొలగించే పని ప్రారంభించారు. ఈ పనిని అపేందుకు శ్రీను వెళ్లగా అతడిపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. వెంటనే భయాందోళనకు గురైన శ్రీను అక్కడి నుంచి పారిపోయి ఉదయాన్నే అందరికి చెప్పాడు. విషయం తెలుసుకున్న గిరిజనులు ఆదివారం ఉదయాన్నే మహబూబాబాద్, కురవి ప్రధాన రహదారి అయిన బేతోలు హైవేపై రాస్తారోకోకు దిగారు. వారి ఆందోళనకు ఎల్‌హెచ్‌పీఎస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతుగా నిలిచారు. రాస్తారోకోతో రెండువైపులా వాహనాలు చాలా దూరం వరకు నిలిచిపోయాయి. ఆయా పార్టీల నాయకులు గుగులోత్ భీమానాయక్, ముల్లంగి ప్రతాప్‌రెడ్డి, గునిగంటి రాజన్న, రేషపల్లి నవీన్ మాట్లాడుతూ మైసమ్మకుంట చెరువు కట్ట కూల్చివేతకు, ఆక్రమించేందుకు యత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఆయన అనుచరులు ఈ పనికి పూనుకున్నారని వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భూకబ్జాలకు పాల్పడేవారిని ఉపేక్షించొద్దన్నారు. కురవి ఎస్సై రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడినప్పటికి వారు రెవెన్యూ అధికారులు రావాలని, శ్రీనుపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కూర్చున్నారు. సివిల్ సప్లై డీటీ మాధవపెద్ది వెంకట్‌రెడ్డి, ఆర్ఐ జర్పుల సుధాకర్ నాయక్, సర్వేయర్ విజయభాస్కర్ రాస్తారోకో వద్దకు వచ్చారు. ఆందోళన కారులతో మాట్లాడారు. రైతులు ఫిర్యాదు చేస్తే సంఘటనకు బాధ్యులైన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసేందుకు ఆదేశిస్తామని డీటీ వెంకట్‌రెడ్డి చెప్పారు. అంతేగాక ప్రొక్లయినర్‌ను సీజ్ చేస్తామని, తిరిగి మైసమ్మకుంట భూమిని సర్వే చేయిస్తామని తెలిపారు. దీంతో ఆందోళనకారులు రాస్తారోకోను విరమించారు. ఆరుగురిపై కేసు నమోదు బేతోలు గ్రామ శివారులోని మైసమ్మకుంట చెరువు కట్టను ధ్వంసం చేసిన విషయంలో రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెరువు కట్టను తవ్వారని దార యాదగిరిరావు, నెల్లూరి శ్రీధర్, వెంకన్న, కె మధు, మల్యాల శ్రీనివాసరావు, రామయ్యపైకేసు నమోదు చేశామని కురవి ఎస్సై రామకృష్ణ తెలిపారు.