ఎమ్మెల్యే శంకర్ నాయక్ అరెస్ట్.. బెయిల్‌పై విడుదల
మహబూబాబాద్: జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌ను స్థానిక పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అనంతరం ఎమ్మెల్యే సొంత పూచీకత్తుపై బెయిల్ పై విడుదలయ్యారు. తన సొంత వాహనంలోనే మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యేపై ప్రాథమిక విచారణ అనంతరం బెయిల్ పై ఆయనను విడుదల చేశారు. కాగా, సెక్షన్ 353, 354 కింద శంకర్‌నాయక్‌పై కేసు నమోదైంది.
ప్రభుత్వ అధికారి విధులను అడ్డుకున్నందుకు 353 సెక్షన్, ఒక మహిళ పట్ల నేరపూరితమైన ఆలోచనతో దాడి చేసినందుకు 354 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రీతి మీనాతో అనుచితంగా ప్రవర్తించారంటూ తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన ఎమ్మెల్యే శంకర్ నాయక్.. పొరపాటున చేయి తగిలి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు.
ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందాక చార్జిషీటు: ఎస్పీ కోటిరెడ్డి
'ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అనుచిత ప్రవర్తనపై 230/2017, యు/ఎస్ 353, 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఈ కేసులో విచారణాధికారిగా తొర్రుర్ డీఎస్పీ రాజరత్నంను నియమించాం. నేటి ఉదయం ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నాం. విచారణ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశాం. కేసుకు సంబంధించి ఫొటోలు, వీడియోను ఎఫ్ఎస్ఎల్‌కు పంపించాం. ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందిన తర్వాత కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేస్తామని' ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
ఏం జరిగిందంటే..
మహబూబాబాద్‌లో బుధవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జిల్లా కలెక్టర్ ప్రీతి మీనాలు పాల్గొన్నారు. హారితహారం కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో నేతలు, అధికారులు మొక్కలు నాటారు. అనంతరం వేదిక మీదకు వెళ్లే సమయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ ప్రీతిమీనా చేయిపట్టుకొని ముందుకు లాగగా ఆమె ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రజా ప్రతినిధి తనను చేయి పట్టుకొని అనాగరికంగా వ్యవహరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కలెక్టర్ ప్రతీమీనా.. మహిళనైన తనను చేయితో తాకాల్సిన అవసరం ఏముందంటూ ఆగ్రహించారు. ఈ అవమానంపై కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.