శంకర్‌దాదా.. ఇదేం మర్యాద? | mahabubabad mla shankar naik misbehave with collector preeti meena | Sakshi
Sakshi News home page

శంకర్‌దాదా.. ఇదేం మర్యాద?

Published Thu, Jul 13 2017 1:55 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM

కలెక్టర్‌ ప్రీతి మీనా చేతిని తాకుతున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ - Sakshi

కలెక్టర్‌ ప్రీతి మీనా చేతిని తాకుతున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

- మహిళా కలెక్టర్‌తో ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తన
- మానుకోట ఎమ్మెల్యే తన చేయి పట్టుకోవడంతో నిర్ఘాంతపోయిన ప్రీతిమీనా
- ‘బీ ఇన్‌ యువర్‌ లిమిట్‌..’ అంటూ తీవ్ర హెచ్చరిక
- ఐఏఎస్‌ల సంఘం, సీఎస్‌తోపాటు పోలీసులకూ ఫిర్యాదు
- మహబూబాబాద్‌ కలెక్టర్‌కు ఉద్యోగుల బాసట
- నల్లబ్యాడ్జీలతో నిరసన.. చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌
- ఎమ్మెల్యే తీరుపై సీఎం కేసీఆర్‌ మండిపాటు
- తక్షణమే బేషరతుగా క్షమాపణలు కోరాలని ఆదేశం
- కలెక్టర్‌కు ఫోన్‌ చేసి సముదాయించిన డిప్యూటీ సీఎం కడియం
- పొరపాటున చేయి తగిలి ఉంటే క్షమాపణలు కోరుతున్నా: ఎమ్మెల్యే


సాక్షి, మహబూబాబాద్‌/హైదరాబాద్‌

మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతి మీనాకు తీవ్ర అవమానం జరిగింది. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ కలెక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించారు. చేయి పట్టుకొని అనాగరికంగా వ్యవహరించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కలెక్టర్‌ను, పైగా మహిళనైన తనను చేయితో తాకాల్సిన అవసరం ఏముందంటూ ఆమె ఆగ్రహించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ అవమానంపై కలెక్టర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. అటు ఐఏఎస్‌ అధికారుల సంఘం కూడా దీన్ని తీవ్రంగా పరిగణించింది. అసోసియేషన్‌ తరఫున వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు సీఎస్‌ను కలసి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే తీరుపై ఉద్యోగ సంఘాలూ మండిపడుతున్నాయి. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా అధికారులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే గురువారం ఉద్యోగాలకు హాజరుకాబోమని కలెక్టరేట్‌ ఉద్యోగులు హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రవర్తనపై ముఖ్యమంత్రి కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన ఆదేశంతో శంకర్‌ నాయక్‌.. కలెక్టర్‌ను కలసి క్షమాపణలు కోరారు. జిల్లాస్థాయి అధికారులతో కూడా ఎమ్మెల్యే అమర్యాదగా మాట్లాడతారని ఈ సందర్భంగా పలువురు వాపోయారు. 1988లో పంజాబ్‌లో నాటి డీజీపీ కేపీఎస్‌ గిల్‌.. ఓ సమావేశంలో ఐఏఎస్‌ అధికారి రూపన్‌ డియోల్‌ బజాజ్‌తో ఇలాగే అమర్యాదగా ప్రవర్తించినందుకు ఆమె సుప్రీంకోర్టు దాకా వెళ్లారని, చివరికి గిల్‌ను కోర్టు తీవ్రంగా తప్పుపట్టిందని అధికారులు గుర్తుచేస్తున్నారు. గిల్‌కు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయని పేర్కొంటున్నారు.

ఐ యామ్‌ కలెక్టర్‌.. బీ ఇన్‌ యువర్‌ లిమిట్‌!
హరితహారం మూడోవిడత కార్యక్రమాన్ని మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం ఆవరణలో బుధవారం మంత్రి చందూలాల్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, కలెక్టర్‌ ప్రీతిమీనా, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అంతా కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటడం పూర్తయ్యాక స్టేజీ వద్దకు వచ్చే సమయంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ కలెక్టర్‌ ప్రీతి మీనా చేయి పట్టుకొని ముందుకు పదండని అన్నారు. దీంతో ఆమె నిర్ఘాంతపోయారు. అక్కడే ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ‘ఐ యామ్‌ కలెక్టర్‌.. బీ ఇన్‌ యువర్‌ లిమిట్‌’అంటూ హెచ్చరించారు. అక్కడ్నుంచి సభావేదికపైకి వెళ్లారు. సభ ముగిసేంత వరకు మిన్నకుండిపోయారు. కార్యక్రమం ముగియగానే జేసీ దామోదర్‌రెడ్డి, డీపీఆర్‌ఓ ఆయూబ్‌ అలీని పిలిచి ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎస్, ఐఏఎస్‌ల సంఘానికి ఫిర్యాదు
అనంతరం కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. తన చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై సరైన ఆధారాలతో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. మీడియాలో తీసిన ఫొటోలు, వీడియో క్లిప్పింగుల కోసం ఆరా తీశారు. ఎమ్మెల్యే తన చేయిపట్టుకున్న ఫొటోలను సంపాదించి.. ఐఏఎస్‌ల సంఘానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీని కూడా పిలిచి, ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తానని చెప్పినట్టు సమాచారం. ఈ లోపు విషయం దావానలంలా వ్యాపించడంతో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్‌ వారందరితో సమావేశమయ్యారు. చివరకు అధికారులంతా నల్లబ్యాడ్జీలతో బయటకు వచ్చారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి బీపీ ఆచార్య ఆధ్వర్యంలో ఐఏఎస్‌ అఫీసర్స్‌ అసోసియేషన్‌ అత్యవసరంగా సమావేశమై ఈ ఘటనను ఖండించింది. కలెక్టర్‌కే ఇలా జరిగిందంటే సాధారణ ఉద్యోగుల పరిస్థితేమిటని సచివాలయంలో పలువురు అధికారులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement