సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదిస్తున్న వేదపండితులు
– జోగుళాంబ అమ్మవారిని దర్శించి పూజించిన సీఎం కేసీఆర్
– ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కుటుంబ సమేతంగా రాక
అలంపూర్ / అలంపూర్‌రూరల్/ మానవపాడు : ‘అమ్మా జగజ్జననీ.. లోకపావనీ రాష్ట్ర ప్రజలందరికీ సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, భోగభాగ్యాలను ప్రసాదించు..’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం అలంపూర్‌లోని ఐదోశక్తి పీఠమైన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను కుటుంబ సమేతంగా సీఎం హోదాలో తొలిసారిగా దర్శించుకున్నారు. అంతకుముందు వారిని దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, కలెక్టర్ టీకే శ్రీదేవి, ఏసీ కష్ణ, ఈఓ గురురాజ, ఆలయ అర్చకులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మొదట బాలబ్రహ్మేశ్వరుడికి అభిషేకాలు నిర్వహించి అనంతరం అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు చేశారు. వారికి ముఖ్య అర్చకులు ఆనంద్‌శర్మ క్షేత్ర ప్రాశస్థ్యాన్ని తెలియ జేసి తీర్థ, ప్రసాదాలు అందజేశారు.
కరపత్రం లేదా?
అమ్మవారి ఆలయాన్ని తెలియజేసే బ్రోచర్, పుస్తకం, కరపత్రం వంటి వాటిని ముద్రించలేదా..? అని సీఎం కేసీఆర్ అర్చకులను ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న ఏసీ కష్ణ వెంటనే ఆలయ చరిత్రను తెలియజేసే కరప్రతాలను సీఎంకు అందజేశారు. అనంతరం ఆలయ సిబ్బందితో కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఆలయాలను అభివద్ధిచేసేందుకు ఆర్కియాలజికల్ సర్వే నిబంధనలు అడ్డు వస్తున్నాయన్నారు.
పెద్దఎత్తున తరలివచ్చిన జనం
సీఎంను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే భద్రత కారణాల దష్ట్యా సెక్యూరిటీ బయటి వారిని లోపలికి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వలేదు. ఆలయంలో సీఎం సుమారు గంట పాటు ఉన్నారు.