కుట్టుకూలీలో కమీషన్ల కక్కుర్తి... | making charges obstacles: no uniform for school childrens | Sakshi
Sakshi News home page

కుట్టుకూలీలో కమీషన్ల కక్కుర్తి...

Published Sun, Feb 14 2016 9:40 AM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM

కుట్టుకూలీలో కమీషన్ల కక్కుర్తి...

కుట్టుకూలీలో కమీషన్ల కక్కుర్తి...

యూనిఫామ్‌కు ఎసరు

* దాదాపు 17 లక్షల విద్యార్థులకు అందని స్కూలు దుస్తులు
* కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం
* కుట్టుపనిలోనూ కమీషన్ల కక్కుర్తే కారణం
* మహిళా సంఘాలకే కుట్టు పనులివ్వాలని సీఎంవో ఆదేశం
* అలా వీలుపడదని విద్యాశాఖ అభ్యంతరం
*  విద్యాశాఖ అధికారుల ఉత్తర్వులకు అడ్డుపడ్డ మంత్రి గంటా
* ఎస్‌ఎంసీ, సంఘాల మాటున టీడీపీ నేతల అక్రమాలు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులంటే ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో వారికి రెండు జతల యూనిఫామ్ దుస్తులు ఇవ్వాల్సి ఉన్నా వాటి సరఫరాలో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఏటా అక్టోబర్ 15 లోపల కుట్టుపనులు పూర్తిచేసి.. ఆ నెలాఖరులోపు విద్యార్థులకు దుస్తుల పంపిణీ పూర్తి చేయాలి. కానీ, విద్యా సంవత్సరం మరో నెలన్నరలో ముగియడానికి వస్తున్నా సగానికి పైగా పేద విద్యార్థులకు యూనిఫాంలు ఇప్పటికీ అందించలేకపోయారు. రాష్ట్రంలో 31,51,968 మంది విద్యార్థులకు యూనిఫామ్‌లు సరఫరా చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ కేవలం 14,79,184 మందికి మాత్రమే అందించినట్లు నాలుగు రోజుల క్రితంనాటి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇంకా 16,72,784 మంది విద్యార్థులకు యూనిఫామ్ అందలేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క విద్యార్థికీ అందకపోగా, సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి జిల్లా విశాఖపట్నంలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అన్ని రంగాల్లోనూ కమీషన్లకు అలవాటు పడిన పాలకులు.. దుస్తుల కుట్టుకూలీ విషయంలోనూ అదే రీతిన వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తమకు అనుకూలంగా వ్యవహరించడంలేదన్న కారణంతో ఉన్నతాధికారి ఒకర్ని ఆ బాధ్యతల నుంచి తప్పించిన విద్యాశాఖ పెద్దలు ఆ తరువాత యూనిఫాం అందజేతపై దష్టి సారించిన దాఖలాలు లేవు. ఈ విద్యాసంవత్సరం మరో నెలలో ముగిసిపోతున్నా.. ఇంకా సగం మంది స్కూలు విద్యార్థులకు దుస్తులు అందని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం దుస్తుల కోసం రూ. 126 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో సాధ్యమైనంత కమీషన్ల పేరిట దండుకోవడానికి ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారులు, అటు మంత్రి అనుచరగణం ప్రయత్నించడంతో లక్ష్యం నెరవేరలేదు.

కమీషన్ల కోసమే..
విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం స్కూల్ మేనేజ్‌మెంటు కమిటీ (ఎస్‌ఎంసీ)ల ద్వారా దుస్తులను కుట్టించి విద్యార్థులకు అందించాలి. ఆ ఎస్‌ఎంసీలకు ముడి వస్త్రాన్ని ఆప్కో పంపిణీ చేయాలి. దానిని ఎస్‌ఎంసీలు దుస్తులు కుట్టించి విద్యార్థులకు అందిస్తాయి. వస్త్రం, కుట్టు పని చార్జీలు మొత్తం స్కూల్ కమిటీల ద్వారానే చెల్లింపులు చేస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం సహకారమందించే ఈ రూ. 126 కోట్ల పనిని కొన్ని సంస్థలకే అప్పగించి తమ కమీషన్ ముందుగా తీసుకోవాలని అటు సీఎంవో, ఇటు మంత్రి కార్యాలయం అధికారులు భావించారు.

దీంతో వారు దుస్తుల కుట్టు పనిని ముందుకు సాగకుండా అడ్డుపడ్డారు. ఎస్‌ఎంసీలకు బదులు మహిళా సంఘాలకు పనులు అప్పగించాలని సీఎంవో అధికారి ఒకరు కొత్త ప్రతిపాదనలు తె రపైకితెచ్చారు. ఇది సాధ్యం కాదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్‌ఎంసీలకే పనులు అప్పగించేలా 2015 నవంబర్ 15న ఆదేశాలు జారీచేశారు. దీనికి మంత్రి గంటా అభ్యంతరం చెప్పారు. దీంతో ఆ ఉత్తర్వులు పెండింగ్‌లో పడ్డాయి. తర్జనభర్జనల అనంతరం ఎస్‌ఎంసీల ద్వారానే దుస్తుల పనిని కొనసాగించాలని అదేనెల 29న మళ్లీ ఆదేశాలు ఇచ్చారు. అయితే పేరుకు ఎస్‌ఎంసీల ద్వారా చేయిస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్నా జిల్లాల్లో ఈ వ్యవహారాన్ని మహిళా సంఘాల పేరిట ప్రైవేట్ వ్యక్తులకే ధారాదత్తం చేశారు.

జిల్లాల్లో అక్రమాలెన్నో..
విద్యార్థుల దుస్తుల పంపిణీ వ్యవహారం జిల్లాల్లో అక్రమాలమయంగా మారింది. స్కూలు యాజమాన్య కమిటీలు, స్వయం సహాయక సంఘాల మాటున అధికార పార్టీకి చెందిన నేతలు కొందరు కోట్లాది రూపాయలు గల్లంతు చేస్తున్నారు. ఎస్‌ఎంసీ ద్వారానే ఈ దుస్తులను కుట్టించాల్సి ఉన్నా కొందరు అధికారపార్టీ నేతలు ఉన్నతస్థాయిలో ఒత్తిడి తెచ్చి జిల్లాల వారీగా తమ వారికే ఈ పనులు దక్కేలా చేశారు. పేరుకే స్కూలు యాజమాన్యాలు కాగా దుస్తుల వ్యవహారం ఆ కమిటీలకు సంబంధం లేకుండానే సాగుతోంది.

సరైన ప్రమాణాలు, కొలతలు పాటించకుండానే దుస్తులను కుడుతున్నారు. దీంతో అవి విద్యార్థులకు సరిపోవడం లేదు. 2015 అక్టోబర్ 15 నాటికి దుస్తుల కుట్టుడం పూర్తికావాలని, అదేనెల 30వ తేదీకి పంపిణీ కూడా పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియా గతంలో ఆదేశాలు జారీచేశారు. కానీ ఆ పంపిణీ ఇప్పటికీ 47 శాతం కూడా పూర్తి కాలేదు. సీఎంవో అధికారుల ఆదేశాలు.. విద్యాశాఖ అధికారులు నిర్లిప్తత ఫలితంగా యూనిఫామ్ పంపిణీ వ్యవహారం అస్తవ్యస్తంగా సాగడంతో పాటు పలు అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.

సీఎంవో నుంచే నేరుగా ఉత్తర్వులు
కేంద్రప్రభుత్వ ఆర్థిక సాయంతో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు రెండు జతల దుస్తులను అందించాలి. ఒక్కొక విద్యార్థికి రూ. 400 ఖర్చు పెట్టాలి. అందులో రూ. 80 కుట్టుకూలికి, రూ. 320 వస్త్రానికి ఖర్చు చేస్తారు. రాష్ట్రంలో ఈ స్కూళ్లలో ఎనిమిదో తరగతి వరకు చదివే విద్యార్థులు 31,51,968 మంది ఉన్నారు. వీరితో పాటు 9, 10 చదువుతున్న 2,17,875 మందికీ యూనిఫామ్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఘనంగా ప్రకటించింది. అయితే ఇప్పటి వరకూ ఒక్కపైసా కూడా విడుదల చేయలేదు. కస్తూర్బా బాలికల పాఠశాలల్లో 8,9,10 తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్‌లు పంపిణీ చేయాల్సి ఉన్నా ఒక్కరికి కూడా ఇవ్వలేదు.

ఇక దుస్తులు కుట్టించడం.. పంపిణీ  ఎస్‌ఎంసీల ద్వారానే చేయించాలని విద్యాశాఖాధికారులు ముందు భావించినా సీఎంవో అధికారుల జోక్యంతో అది వక్రమార్గం పట్టింది. మహిళా సంఘాలను తెరపైకి తెచ్చి.. ఏ జిల్లాలో ఏ సంఘానికి కుట్టుపని అప్పగించాలో కూడా సీఎంవో అధికారులే నిర్దేశించారు. సీఎం చంద్రబాబు సూచించిన సంఘాలకు కుట్టుపనులు ఇవ్వాలని సీఎం సహాయ కార్యదర్శి జి.రామసుబ్బయ్య పేరిట సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) అధికారులకు లేఖ అందింది. దీంతో విద్యాశాఖాధికారులు ఎస్‌ఎంసీలకు బదులు సంఘాలకు పనులు అప్పగించేలా జిల్లాల అధికారులకు సూచనలు పంపారు.

నెల్లూరు జిల్లాలో సగమే..
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మొత్తం 3,462 పాఠశాలలున్నాయి. వీటిలో 1,791 పాఠశాలలకు యూనిఫామ్ అందజేశారు. ఇంకా 1,661 పాఠశాలలకు దుస్తులను ఆందజేయాల్సి ఉంది. అధికారులు మాత్రం దుస్తులు టైలర్లు దగ్గర ఉన్నట్లు చెబుతున్నారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని సైదాపురం, డక్కిలితో పాటు మరికొన్ని మండలాల్లో ఇప్పటికీ యూనిఫాం దుస్తులు ఎంఈవో కార్యాలయాల్లోనే ఉన్నాయి. యూనిఫామ్‌ను కుట్టే బాధ్యతను ఎక్కువగా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పజెప్పారు. జిల్లాలో ఓబులరెడ్డి, మంజునాథ్ గార్మెంట్స్, సీడ్ స్వచ్ఛంద సంస్థ, అనితారెడ్డి, వీరభధ్ర గార్మెంట్స్, కష్ణమూర్తి తదితర ప్రైవేటు సంస్థలకు ఈ పనులు అప్పగించారు. కొన్ని ప్రాంతాల్లో పొదుపు సంఘాలతో ఈ దుస్తులను కుట్టిస్తున్నారు.

విజయనగరం జిల్లాలో పరిస్థితి ఇది
విజయనగరం జిల్లాలో 3,044 ప్రభుత్వ, కేజీబీవీ, ఆదర్శ, ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. మొత్తం 34 మండలాలకుగానూ యూనిఫాంలను 14 మండలాలలో మాత్రమే పూర్తి స్థాయిలో పంపిణీచేశారు. డీఆర్‌డీఏ పరిధిలోని 11 మండలాలలో 7 మండలాలకు, నాలుగు ప్రైవేటు సంస్థల కుట్టు బాధ్యత తీసుకున్న 23 మండలాల్లో 7 మండలాలలో విద్యార్థులకు పంపిణీ చేశారు. కొన్ని మండలాలలో స్థానిక అధికార పార్టీ నేతల చేతులమీదుగా పంపిణీ చేయడానికి నిరీక్షించడం వల్ల  దుస్తులు సిద్ధంగా ఉన్నప్పటికీ పంపిణీలో జాప్యమవుతోంది. విద్యాసంవత్సరం ఆరంభించిన రెండు నెలలకు సంబంధిత నిధులు వచ్చాయి. తర్వాత తీవ్ర జాప్యం వల్ల నవంబర్ మొదటి వారంలో జిల్లా కేంద్రానికి వస్త్రం వచ్చింది. 11 మండలాల పరిధిలో సంబంధిత మండలాల మహిళా స్వయం సహాయక సంఘాలకు కుట్టు బాధ్యత అప్పగించారు. మిగిలిన 23 మండలాల్లో దుస్తుల కుట్టు పనిని నాలుగు ప్రైవేటు కుట్టు సంస్థలకు అప్పగించారు.

డబ్బులిస్తేనే కుట్టిస్తాం..
జిల్లాల్లో కుట్టుపని పొందిన సంఘాలు తమకు నచ్చిన ప్రైవేటు వ్యక్తులు, కుట్టు సంస్థలకు ఈ పనులు అప్పగించి కమీషన్లు తీసుకున్ననట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని సంఘాలు తమకు ముందుగా కుట్టు పని డబ్బులు ఇస్తేనే దుస్తులు కుట్టి ఇస్తామని మొండికేస్తుండడంతో దుస్తుల పంపిణీ సజావుగా సాగడం లేదు. కుట్టు నిధులను ఎస్‌ఎంసీల ద్వారానే విడుదల చేస్తున్నందున తాము ఆ కమిటీ చుట్టూ తిరగలేమని, నేరుగా నిధులిచ్చేయాలని ఒత్తిడిచేస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాలకు పూర్తిగా నిధులు విడుదల చేసినా దుస్తుల పంపిణీ మాత్రం పూర్తికాలేదు. మిగిలిన విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం ముగిసేలోగా అందుతాయో లేదో వేచిచూడాలి. తూర్పుగోదావరిలో ఒక్క జత కూడా పంపిణీ కాకపోగా మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత జిల్లా విశాఖ.. దుస్తుల పంపిణీలో ఆఖరి స్థానం దక్కించుకోవడం విశేషం.

సీఎం సూచించిన సంఘాలు..
సాయిరాం స్వయంశక్తి సంఘం (శ్రీకాకుళం), సిద్ధివినాయక మహిళాసంఘం (విజయనగరం), అప్పన్నబాబు గ్రూపు(విశాఖ), ధనలక్ష్మీ శక్తిసంఘం, మాద సుభాషిణి గ్రూపు (తూ.గోదావరి), శ్రీప్రేమసాయి గ్రూపు (కృష్ణా), శ్రీశివసాయి ప్రణతి మహిళా గ్రూపు (గుంటూరు), చాముండేశ్వరి గ్రూపు (నెల్లూరు), ఉషోదయా గ్రూపు (వైఎస్సార్), సరస్వతి గ్రూపు (కర్నూలు), బాలాజీ గ్రూపు, పి.స్వాతి గ్రూపు (చిత్తూరు), వెంకటేశ్వర మహిళామండలి (అనంతపురం), సాయిగణేశ మహిళాశక్తి సంఘం (ప్రకాశం)

సీఎం సొంత జిల్లాలో ఇలా..
సీఎం సొంత జిల్లా చిత్తూరులో 4,384 మంది బాలురు, 4,376 మంది బాలికలు మొత్తం 8,760 మంది విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాం అందలేదు. జిల్లాలోని 66 మండలాలుకు గాను ఏర్పేడు, రామసముద్రం, కేవీబీ పురం మండలాల్లో ఇంకా పిల్లలకు యూనిఫాం ఇవ్వనేలేదు. గతంలో పాఠశాల ఎస్‌ఎంసీ ఖాతాలకు యుూనీఫామ్‌కి సంబంధించి నిధులు విడుదలయ్యేవి. తరువాత ప్రైవేటు సంస్థ నుంచి వస్త్రం కొనుగోలు చేసి కుట్టించి ఇవ్వాల్సి ఉండటంతో యుూనీఫాం అందటం ఆలస్యం అయ్యేవి. ఈ జాప్యాన్ని నివారించటంతోపాటు విద్యా సంవత్సరం ఆరంభం నాటికే విద్యార్థులకు రెండు జతలు దుస్తులు అందించాలనుకున్నారు. అధికారపార్టీ నాయుకులు జోక్యం చేసుకుని కమీషన్ల కోసం యుూనీఫాం కుట్టే బాధ్యత తావుు సిపార్సు చేసిన ఏజెన్సీలకే అప్పగించాలంటూ అధికారులకు హుకుం జారీ చేశారు. కుట్టు బాధ్యత దక్కించుకున్న ఏజెన్సీలు ఇప్పటి వరకు కొన్ని పాఠశాలలకు అందించనేలేదు. బిల్లులు చెల్లించకపోవడంతోనే ఏజెన్సీలు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement