‘గుండు’ కొడుతున్నారు!
– ఈరన్న క్షేత్రంలో కేశఖండన కార్మికుల వసూళ్లు
– ఒక్కో గుండుకు రూ.50 అదనం
– విమర్శిస్తున్న భక్తులు
– ఎరుగనట్లు అధికారులు
మంత్రాలయం :
మొక్కు తీర్చుకోవడానికి కేశఖండనకు వెళ్తే ముక్కుపిండి వసూళ్లు. ఇచ్చుకుంటే పూర్తి గుండు.. లేదంటే నెత్తిన కత్తి పెట్టరు. ఎందుకివ్వాలని ఎదరిస్తే ఎదురుదాడి. అరచీ గీపెట్టుకున్నా పట్టించుకునే నాథుడు లేడు. ఇదీ ఉరకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో సాగుతున్న తంతు. కేశఖండనలో నిలువు దోపిడీకి గురవుతున్న భక్తుల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. తిరుమల తిరుపతి వేంకన్న క్షేత్రం తర్వాత ఉరకుంద క్షేత్రంలో కేశఖండనకు ఎంతో ప్రత్యేకత ఉంది. లక్షలాది మంది భక్తులు దేవుడి మొక్కుగా కేశాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. క్షేత్రంలో టెంకాయలు, వ్యాపార దుకాణాలు కంటే ఎక్కువ మొత్తంలో టెండర్ కల్యాణకట్టకు ఉంది. రూ.1.73 కోట్లకు ఈ ఏడాది ఇక్కడ కళ్యాణ కట్టను పాడారు. భక్తులు కేశఖండనకు గుండుకు రూ.10 చొప్పున టిక్కెట్ తీసుకోవాలి. అందులో ఆలయానికి రూ.5, కేశఖండన కార్మికులకు రూ.5 చొప్పున విభజించి పంచుకోవాల్సి ఉంది.
అడినంత ఇవ్వాల్సిందే:
శ్రావణమాసం ఇక్కడి కల్యాణ కట్ట కార్మికులకు వరాలు కురిపిస్తోంది. క్షేత్రాన్ని దర్శించుకోవడానికి 15 లక్షల మంది భక్తులు ఇక్కడకు వస్తారు. కనీసం 5 లక్షల మంది దాక కేశఖండన చేయించుకుంటారు. అయితే ఇక్కడి కల్యాణకట్టలో గుండు గీస్తున్న వారు భక్తులను పీడించి పిప్పి చేస్తున్నారు. గుండు కొట్టాలంటే బ్లేడు పేరుతో ఏకంగా రూ.50 అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే గొడవకు సైతం వెనకాడని వైనం. మంగళవారం నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన 15 మంది యువకులు గుండు గీయించుకున్నారు. అందుకు గుండు చేయిన కార్మికులు రూ.50 ఇచ్చుకోవాలంటూ గొడవకు దిగారు. ఎందుకివ్వాలని అడిగితే ఎవరికైనా చెప్పుకోడంటూ కసురుకున్నాడు. పాపం చేసేదేమి లేక బాధితులు డిమాండ్ మేరకు ఇచ్చుకోవాల్సి వచ్చింది. శ్రావణమాసంలోనే కనీసం రూ.10 లక్షలకుపైగా అక్రమార్జన ఇక్కడ సాగిపోతోంది.
దోపిడీకి అధికారుల అండ
ఆలయ ప్రధానాలయం వెనకాలే కల్యాణ కట్ట ఉంది. అక్కడ దోపిడీ తతంగం తెలిసినా కళ్లు తెరవడం లేదు. భక్తులు కోకొల్లలుగా ఫిర్యాదులు చేసినా కుర్చీలు వీడటం లేదు. వేడుక చూస్తూ దోపిడీకి పరోక్షంగా మద్దతుగా పలుకుతున్నారు. భక్తులు గోడు వినిపించుకునే తీరిక లేదంటే మరి బాధ్యత నిర్వహణలో అధికారులు ఎంతమాత్రం బాధ్యతయుతంగా నడుచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. దోపిడీపై వివరణ ఇచ్చేందుకూ అధికారులు నోరు మెదపడం లేదు. మంగళవారం ఈవో మల్లికార్జున ప్రసాద్‌కు వివరణ నిమిత్తం సాక్షి ఫోన్ చేయగా స్పందన కరువైంది. సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావును అడుగగా ఈవో అడగాలని దాటవేశారు. భక్తులకు సమాధానం చెప్పుకోవాల్సిన అధికారులు నడతపై భక్తులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.
భక్తులకు మర్యాద లేదు : నాగమ్మ, ఆలూరు
స్వామి మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడకు వచ్చాను. మంచి జరిగితే తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నాను. గుండు గీయించుకోవడానికి రూ.10 టిక్కెట్ తీసుకున్నాను. గుండు గీసే కార్మికుడు రూ.50 ఇవ్వాలని డిమాండ్ పెట్టాడు. రూ.30 ఇస్తానని చెబుతున్నా వినలేదు. నన్నే దబాయించి వసూలు చేసుకున్నాడు.
దోపిడీ దారుణం : సురేంద్ర, హాలహర్వి
స్వామి మొక్కులో భాగంగా తలనీలాలు ఇచ్చాను. మేమంతా 15 మంది టిక్కెట్లు కొని గుండు గీయించుకున్నాం. గుండు చేసిన తర్వాత గుండుకు రూ.50 ఇవ్వాలని కార్మికుడు డిమాండ్ చేశాడు. ఇదేంటని అడిగితే తీవ్ర గొడవకు దిగాడు. నిలువునా దోచుకుంటున్నా పట్టించుకునేనాథుడు లేడు. ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు. అధికారులు ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదు.