
ఫేస్‌బుక్ పరిచయంతో 14 లక్షలు వసూలు
ఫేస్‌బుక్ పరిచయంతో ఓ మహిళను బ్లాక్ మెయిల్ చేసిన ఓ వ్యక్తి రూ.14 లక్షలు వసూలు చేశాడు.
నాగోలు: ఫేస్‌బుక్ పరిచయంతో ఓ మహిళను బ్లాక్ మెయిల్ చేసి రూ.14 లక్షలు తీసుకుని విదేశాలకు పారిపోయిన నింది తున్ని ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిం చారు. ఎల్‌బీనగర్ సీఐ కాశిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా మారుతీనగర్‌కు చెందిన రాజ్‌గోపాల్‌రెడ్డి ఎంఎస్ చదువుకుని లండన్ లో ఉద్యోగం చేసేవాడు. అతనికి ఫేస్‌బుక్ ద్వారా ఎల్‌బీనగర్ శివగంగకాలనీకి చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది.
దీనిని ఆసరాగా చేసుకున్న రాజ్‌గోపాల్‌రెడ్డి ఆమెతో చనువుగా మాట్లాడేవాడు. 2012 అక్టోబరులో నగరానికి వచ్చిన అతను కొంతకాలం కేపీహెచ్‌బీ కాలనీలో ఉండగా వారి పరిచయం మరింత పెరిగింది. ఈ క్రమంలో అతను సదరు మహిళ మాటలను సెల్‌ఫోన్ లో రికార్డు చేసి భర్తకు చెబుతానని బెదిరించి తన తల్లి క్లెమెనా, సోదరి తుమ్మరాజు ప్రియాంక ఖాతాల్లో డబ్బులు జమ చేయించుకున్నాడు.
2014 డిసెంబర్‌లో ఆమె తనను రాజ్‌గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి తన ఫోన్ సంభాషణలను రికార్డు చేసి బెదిరిస్తున్నాడని, అతనికి రూ.14 లక్షలు ఇచ్చినట్లు భర్తకు చెప్పింది. వారు ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. రాజ్‌గోపాల్‌రెడ్డి పాస్‌పోర్టు, వీసా సంబంధిత వివరాలను ఇమ్మిగ్రేషన్ అధికారులకు పంపారు. శనివారం సాయంత్రం అతను అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాగానే ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారం మేరకు ఎల్‌బీనగర్ ఎస్‌ఐ శ్రీనివాస్ ఎయిర్‌పోర్టుకు అతన్ని అరెస్ట్ చేసి పాస్‌పోర్టు, వీసాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.