మానవత్వం మటుమాయం
శ్రీకాకుళం సిటీ : నాగావళి నదీ తీరం (రిమ్స్ ఆస్పత్రి) వెనుక ఓ మృతదేహాన్ని కుక్కలు, పందులు పీక్కుతినడాన్ని చూసిన అటువైపు వెళ్లే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బంధువులకు అప్పగించాల్సిన మృతదేహాన్ని నిర్లక్ష్యంగా పైపైన పూడ్చి పెట్టడంతో ఈ దుస్థితి దాపురించింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఆమదాలవలస రైల్వేస్టేషన్ రెండో నంబర్ ప్లాట్ ఫాంపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ఈ నెల 15 రాత్రి రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. 16న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. 17వ తేదీ సాయంత్రం రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుని వద్ద లభ్యమైన రైల్వే టిక్కెట్ ఆధారంగా గుంటూరు నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు ట్రైన్‌లో ప్రయాణించినట్టు గుర్తించారు. శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో పత్రికాప్రకటన జారీ చేశారు.
రైల్వే పోలీసుల సమక్షంలో పూడ్చివేత
రిమ్స్‌లో 17వ తేదీ రాత్రి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ైరె ల్వే పోలీసుల సమక్షంలో రిమ్స్ వెనుక నాగావళి నదీ తీరాన నదిలో పూడ్చారు. తమ సమక్షంలోనే మృతదేహాన్ని నాగావళి తీరాన పూడ్చామని ఆమదాలవలస రైల్వే హెచ్‌సీ ప్రకాశరావు తెలిపారు. గుంటూరు జిల్లాలో 21న పత్రికల్లో ప్రకటన చూసిన మృతుని కుటుంబ సభ్యులు ఈ నెల 23న శ్రీకాకుళం వచ్చి అధికారులను కలిశారు.
మృతుని ఫొటో, అతని దుస్తుల ఆధారంగా మృతదేహం రంగనాథ్‌గా కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతుడు గుంటూరు జిల్లాకు చెందిన పట్నాల రంగనాథ్(35), అతని భార్య శ్రీకాకుళం పట్టణానికి చెందినదిగా పోలీసులు నమోదు చేసుకున్నారు. అప్పటికే నాగావళి తీరాన పూడ్చిన మృతదేహాన్ని మళ్లీ బయటకు తీయించారు. మృతదేహాం పూర్తి కుళ్లిపోవడంతో వారు అక్కడే వదిలేసి వెల్లినట్టు తెలిసింది.
నిబంధనలేమీ లేవు
గుర్తుతెలియని మృతదేహాలను రిమ్స్ మార్చురీలో ఎన్ని రోజులైనా ఉంచవచ్చును. ఇన్ని రోజులే ఉంచాలన్న నిబంధనలు ఏమీ లేవు. మృతుల కుటుంబ సభ్యులు వచ్చే వరకు మార్చురీలోనే ఉంచవచ్చు. ఎవరూ గుర్తించని పక్షంలో పత్రికలకు, రిమ్స్ అవుట్ పోస్టు పోలీసులకు, మున్సిపాలిటీకి రిమ్స్ నుంచి సమాచారాన్ని తెలియజేస్తాం.
డా.సునీల్‌నాయక్,
సూపరిండెంటెంట్, రిమ్స్