శుభలేఖ ఇచ్చేందుకు వచ్చి..
నారాయణపురం(ద్వారకాతిరుమల) : రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని లారీ రూపంలో వేగంగా దూసుకువచ్చిన మృత్యువు బలితీసుకుంది. ఈ ఘటన మండలంలోని నారాయణపురం రహదారిపై గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన నక్కా చిన్నారావు(60) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతని భార్య 20 ఏళ్ల క్రితం మరణించింది. ఆయనకు సంతానం లేకపోవడంతో అన్న కుమారుడిని పెంచుకున్నాడు. చిన్నారావు మండలంలోని పి.కన్నాపురంలో నిర్మిస్తున్న కోకోకోలా ఫ్యాక్టరీలో గతంలో తనకు మేనల్లుడి వరుస అయ్యే గాడి ప్రసాద్‌తో కలసి కొంతకాలం పనిచేశాడు.
ఆ తరువాత తిరిగి విశాఖపట్నానికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం పెంచుకున్న కొడుకు పెళ్లి వచ్చేనెల 1న నిశ్చయమవడంతో చిన్నారావు తన బంధువులందరికీ శుభలేఖలు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే నారాయణపురంలో ఉంటున్న గాడి ప్రసాద్ ఇంటికి శుభలేఖ ఇచ్చేందుకు రెండురోజుల క్రితం వచ్చాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం టిఫిన్ చేసేందుకని స్థానిక పంచాయతీ కార్యాలయం రోడ్డు అవతల ఉన్న హోటల్‌కు వెళ్లేందుకు యత్నిస్తుండగా, బెంగళూరు నుంచి కోల్‌కతాకు వెళ్తున్న మినీలారీ ఢీకొంది. దీంతో చిన్నారావు అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలాన్ని భీమడోలు సీఐ ఎం.వెంకటేశ్వరరావు పరిశీలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు.