
గాయపడిన కళ్యాణ్ , కళ్యాణ్ ధరించిన హెల్మెట్
హెల్మెట్ ధరించడం వల్లే అతని ప్రాణాలు నిలిచాయని ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం రాత్రి మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటన..
ఎస్పీ సత్యయేసుబాబు
ఒంగోలు : హెల్మెట్ ధరించడం వల్లే అతని ప్రాణాలు నిలిచాయని ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం రాత్రి మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలను వివరించారు. నెల్లూరు జిల్లాకు చెందిన మద్దాళి కళ్యాణ్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ఆయన పనిమీద నెల్లూరు నుంచి చిలకలూరిపేటకు తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బండిపై వెళుతుండగా తిమ్మనపాలెం సమీపంలో టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనాన్ని ఢీకొట్టి రోడ్డు మీద పడిపోయాడని తెలిపారు.
పడిపోయిన సమయంలో కళ్యాణ్ తల బలంగా రోడ్డుమీద ఉన్న డివైడర్‌కు తగిలిందని, ఈ క్రమంలో హెల్మెట్ డ్యామేజి అయిందే కానీ, అతని తలకు ఎటువంటి గాయం కాకపోవడంతో అతను సురక్షితంగా ఉన్నాడన్నారు. అయితే భుజానికి తగిలిన గాయంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని ప్రాణ రక్షణకు హెల్మెట్ ఎంతగానో తోడ్పడిందని పేర్కొన్నారు. వాహనదారులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకే హెల్మెట్ ధరించాలని ఎస్పీ సత్యయేసుబాబు విజ్ఞప్తి చేశారు.