- అత్తారింట్లో ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
- మృతురాలికి రెండు నెలల బాబు
- దుబాయ్‌లో చిన్నారి తండ్రి
- మాతృదినోత్సవానికి ఒక రోజు ముందు ఘటన
జగిత్యాల రూరల్: తల్లి చేతి గోరు ముద్దలు తినాల్సిన చిన్నారి ఒంటరయ్యాడు. అప్పటి వరకు అమ్మ ఒడిలో ఆటలాడిన పసివాడు నిమిషాల వ్యవధిలో మాతృ ప్రేమకు దూరమయ్యాడు. అభం శుభం తెలియని రెండు నెలల చిన్నారిని వదిలి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి పొద్దు పోయాక చోటు చేసుకుంది. మాతృ దినోత్సవానికి ఒక రోజు ముందే జరిగిన ఈ ఘటనల అందరిని కలిచివేసింది.
జగిత్యాల పట్టణంలోని సాయిబాబా ఆలయ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకుంటున్న బొమ్మకంటి నవ్య(27) శనివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నిర్మల్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం దహెగం గ్రామానికి చెందిన నవ్యను మూడు సంవత్సరాల క్రితం జగిత్యాల పట్టణానికి చెందిన బొమ్మకంటి ధీరజ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు.
వివాహం అయినప్పటి నుంచి ధీరజ్, నవ్యలు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవలే దుబాయ్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ధీరజ్‌కు ఉద్యోగం రావడంతో ఆరు నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. నవ్య రెండు నెలల క్రితం బాబుకు జన్మనివ్వడంతో 21వ రోజు మార్చి 16న జరుగగా ధీరజ్ వచ్చి వెళ్లాడు. జగిత్యాలలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అత్త శాంతతో కలిసి ఉంటున్న నవ్య తల్లిదండ్రులు ఆరు నెలల క్రితం గ్రామంలో ఓ చిన్నపాటి గొడవతో మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి మానసికంగా ఇబ్బంది పడుతున్న నవ్య అపార్ట్‌మెంట్‌లో కూడా ఒంటరిగా ఉండేది.
శుక్రవారం సాయంత్రం మూడున్నర గంటల సమయంలో అత్త శాంత పని నిమిత్తం బయటకు వెళ్లగా నవ్య రెండు నెలల కుమారుడిని పక్క ఇంట్లో వారికి ఇచ్చి మళ్లీ వస్తానని చెప్పి బెడ్‌రూంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అత్త శాంత నాలుగు గంటల సమయంలో ఇంట్లోకి వచ్చేసరికి నవ్య మృతి చెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్ధలికి చేరుకున్న డీఎస్పీ కరుణాకర్, రూరల్ సీఐ శ్రీనివాస్‌చౌదరి, ఎస్సై కృష్ణలు మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. దుబాయ్‌లో ఉన్న భర్త ధీరజ్‌కు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు.