
పెళ్లయిన ఆర్నెల్లకే.. ప్రియుడితో ఆత్మహత్య
మంచిర్యాల: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం హజీపూర్ పోలీస్ స్టేషన్ ముందు ఓ జంట శనివారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటనలో ప్రియురాలు మృతి చెందగా, ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం కనపర్తి గ్రామానికి చెందిన సౌందర్య... ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నమ్నూరు గ్రామంలోని బంధువుల ఇంటికి తరచుగా వెలుతుండేది. ఈ క్రమంలో నమ్నూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యాదగిరి సురేష్‌తో ప్రేమ చిగురించింది. విషయం పెద్దలకు తెలియడంతో సౌందర్యకు ఆరు నెలల క్రితం వేరే వ్యక్తితో వివాహం జరిపించారు.
కాగా, వారం క్రితం సౌందర్య, సురేష్ కలసి అదృశ్యమయ్యారు. దీంతో సౌందర్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సురేష్‌పై పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. శనివారం వీరు హజీపూర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పురుగుల మందు సేవించడంతో వారిని సత్వరమే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి మార్చారు. చికిత్స పొందుతూ సౌందర్య మృతి చెందగా, సురేష్ పరిస్థితి విషమంగా ఉంది.