అనంతపురం న్యూటౌన్ : జీఎస్టీపై ప్రభుత్వం నోటిఫై చేసే వరకూ వే బిల్లులు లేకున్నా ఇన్వాయిస్ ఉంటే సరుకు రవాణా చేసుకోవచ్చునని జిల్లాలోని డీలర్లకు రాష్ట్ర పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కల్పన సూచించారు. ఇన్వాయిస్‌లు కంప్యూటర్ ద్వారానే కాకుండా మాన్యువల్‌గా కూడా ఇవ్వొచ్చునని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం పన్నుల శాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కొత్త వ్యాపారులు జీఎస్టీ పరిధిలోకి ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకుంటే రిజిస్ట్రేషన్ అవుతుందన్నారు. వ్యాట్ నుంచి జీఎస్టీ పరిధిలోకి ఇప్పటి వరకూ రానివారికి ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ నెల 1 నుంచి జీఎస్టీలో కొత్తగా రిజిస్ట్రేషన్ పొందినవారు పాత వ్యాట్ టిన్ నంబరుతో ఇన్వాయిస్ ఇవ్వొచ్చన్నారు. జీఎస్టీకి సంబంధించి ఏమీ సందేహాలున్నా నేరుగా తమ శాఖలో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు.