వాసునగర్ ఘాట్‌లో వసతులు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం
– వాసునగర్ ఘాట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే చిట్టెం
మాగనూర్ (గుడెబల్లూర్) : కృష్ణా పుష్కరాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. పుష్కరాల్లో భాగంగా శుక్రవారం వాసునగర్ ఘాట్‌ను ఆయన సందర్శించారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్నానపు గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతిని పరిశీలించారు. వికలాంగులు, చిన్నపిల్లలకు, వృద్ధులకు నది ఒడ్డున ప్రత్యేకంగా స్నానాల కోసం నీటివసతిని ఏర్పాటు చేయాలని ప్రత్యేక అధికారి వెంకటయ్యగౌడ్‌ను ఆదేశించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందుల కలగకుండా అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉందని, గజ ఈతగాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్నానాల ఘట్‌లో ఏర్పాటు చేసిన ఇనుపజాలిపై కర్రలతో కట్టాలని, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మాగనూర్ జెడ్పీటీసీ సరితా మధుసూదన్‌రెడ్డి, ఊట్కూర్ జెడ్పీటీసీ సూర్యప్రకాశ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ గోవిందప్ప, విజయ్‌గౌడ్, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ నాయకులు పాల్గొన్నారు.