సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా
Published Mon, Oct 24 2016 9:45 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
కాకినాడ సిటీ :
మధ్యాహ్న భోజన పథక కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కార్మికులు సుమారు రెండుగంటలపాటు కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనం రూ.5వేలు ఇవ్వాలని, బిల్లులు, వేతనాలు ప్రతినెలా ఐదో తేదీలోపు చెల్లించాలని, గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని, వారంలో మూడు గుడ్లు వేయాలనే వేధింపులు ఆపాలని, పథకం అమలుకు సదుపాయాలు కల్పించాలని, కార్మికులకు ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలని, ధరల పెరుగుదలకు అనుగుణంగా బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. యూనియ¯ŒS గౌరవాధ్యక్షురాలు జి.బేబీరాణి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజనం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ధరలు పెరుగుతూ ఉంటే ప్రభుత్వం బడ్జెట్‌ను తగ్గిస్తోందన్నారు. వంట చేసే కార్మికులకు బిల్లులు సకాలంలో అందక సరుకుల కోసం అప్పు తెచ్చి వండే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియ¯ŒS జిల్లా అధ్యక్షురాలు ఎం.పద్మ, కార్మికులు పాల్గొన్నారు.
Advertisement