ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్‌లోని ఆర్కే 5గనిలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో సపోర్టుమన్ బద్రి జనార్దన్(53) మృతిచెందాడు. మరో సపోర్టుమన్ మచ్చకుర్తి రాయమల్లు గాయపడ్డాడు. వీరు శనివారం రాత్రి షిఫ్ట్ డ్యూటీలకు హాజరయ్యారు. గని భూగర్భంలోని 4వ సీం, 12 లెవల్, 11 డిప్ వద్ద విత్‌డ్రాయింగ్ పనులు నడుస్తున్నాయి. వీరితోపాటు అక్కడ మరో నలుగురు సపోర్టుమన్లు, ఇద్దరు లైన్‌మన్లు పని చేస్తున్నారు. దిమ్మెకట్టె పనిలో ఉండగా ఒక్కసారిగా పైకప్పు బండ కూలింది. శబ్దం విని ఆరుగురు క్షణాల్లో అక్కడి నుంచి తప్పించుకోగా.. జనార్దన్ బండ కింద పడి అక్కడిక్కడే మృతిచెందాడు. రాయమల్లు దిమ్మెకు పక్కనే ఉండడంతో శిథిలాల కింద చిక్కుకున్నాడు. సర్ధార్ కుమారస్వామి సమాచారం మేరకు రెస్క్యూ సిబ్బంది మూడు గంటలు శ్రమించి జనార్దన్ మృతదేహం, రాయమల్లును బయటకు తీశారు. రాయమల్లు కుడికాలుకు గాయం కావడంతో రామకృష్ణాపూర్‌లోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.