
పాతపట్నంలో బాబాయ్ అబ్బాయ్ హవా
► అంగన్‌వాడీ, గ్యాస్ కనెక్షన్లు, రుణాలన్నీ తమ వారికే?
► పార్టీ మండలాధ్యక్షుడి పదవి భర్తీకీ ఆర్నెళ్లు ఫుల్‌స్టాప్
► కొత్తూరుపై అంత ప్రేమెందుకో?
► గ్రూపుల్ని తయారు చేస్తున్నారంటూ విమర్శ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కొత్తూరు పరిసర ప్రాంతాలపై బాబాయ్ అచ్చెన్నాయుడు, అబ్బాయ్ రామ్మోహన్‌నాయుడు ప్రత్యేక ప్రేమ ఒలకబోస్తున్నారు. జిల్లాలో అన్ని చోట్లా తమదే హవా ఉండాలని కోరుకుంటున్న వీరిద్దరూ కొత్తూరుపై మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండడం అక్కడివారికి రుచించడం లేదు. ముఖ్యంగా ఎన్నికల ముందు పార్టీలో చేరిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుతో పాటు ఆయన వర్గీయుల్ని దెబ్బతీసేందుకే బాబాయ్, అబ్బాయ్‌లు ఇలా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమిని చవిచూసిన శత్రుచర్లకు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పార్టీ అధినేత అవకాశం ఇచ్చారు.
తొలినుంచీ విజయరామరాజు రాకను వ్యతిరేకిస్తున్న కింజరాపు వర్గం ఇప్పుడు ఆ నియోజకవర్గంలో తమదే పెత్తనం కావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల హిరమండలం మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టు భర్తీ విషయంలోనూ మంత్రి అచ్చెన్న వ్యవహారం రాజకీయ దుమారం రేగింది. తాను చెప్పిన వ్యక్తికే ఈ పదవి కట్టబెట్టాలని మంత్రి ఒత్తిళ్లు తేవడం, దీనిని శత్రుచర్ల సహా పార్టీ ఇతర పెద్దలూ కలుగజేసుకుని నియోజకవర్గ ఇన్‌చార్జి చెప్పిన వ్యక్తికే ఇవ్వాలని పట్టుబడడం, విషయం సీఎం వరకు వెళ్లడం, చంద్రబాబు కూడా మంత్రిని హెచ్చరించడం కూడా జరిగింది. అయితే నియోజకవర్గానికే కీలకంగా ఉన్న కొత్తూరుపైనా అచ్చెన్న, రామ్మోహన్‌నాయుడు పెత్తనం వహిస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఇదీ కథ
కొత్తూరులో టీడీపీ రెండుగా చీలిపోయింది. తొలినుంచీ పార్టీని నమ్ముకుని ఉన్నవారు కొందరైతే పార్టీలో శత్రుచర్ల చేరిన తరువాత ఆయన వర్గీయులుగా మరికొందరు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో అక్కడి మండల పార్టీ అధ్యక్షుడి నియామకం కూడా జిల్లాలో అన్ని చోట్లా ముగిసిపోయినా కొత్తూరులో మాత్రం ఆర్నెళ్లు ఆగిపోయింది. దీనంతటికీ కారణం ఎంపీ, మంత్రేనని ఆరోపణలొచ్చాయి. పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా శిరీష బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిస్థితి చక్కదిద్దారు.
కమిటీ సభ్యుల్ని ఏర్పాటు చేసి.. పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పలుమార్లు ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆ ప్రాంతం వెళ్లిన ప్రతీసారి దివంగత నేత ఎర్రన్నాయుడిని నమ్ముకున్న వారికే పార్టీ నుంచి పూర్తిస్థాయి సహాయ సహకారాలుంటాయని, పనులన్నీ వారికే జరుగుతాయని బల్లగుద్ది మరీ స్పష్టం చేశారు. మంత్రి సమక్షంలోనే ఎంపీ ఇలా అనడంపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. పోస్ట్‌మెట్రిక్ హాస్టల్ ప్రారంభోత్సవం, జూనియర్ కళాశాల, ఆస్పత్రి అదనపు భవనాల శంకుస్థాపన సమయంలోనూ ఎంపీ ఇదే విషయాన్ని చెప్పడాన్ని అక్కడి కొత్త నాయకులు ఖండిస్తూ వచ్చారు.
పథకాల్లోనూ పెత్తనమే
గ్యాస్ కనెక్షన్ల మంజూరీలో కొత్త టీడీపీ, పాత టీడీపీ అంటూ వైష్యమ్నాల్ని రెచ్చగొడుతున్నారు. బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరీలో ఎంపీ, మంత్రి పెత్తనం వహిస్తున్నారు. జోగిపాడు, నేతాజీనగర్ కాలనీ, ఆకుల తంపర పరిసర ప్రాంతాల అంగన్‌వాడీ పోస్టుల్నీ వాళ్లకు అనుకూలంగా ఉన్నవారికే ఇచ్చుకున్నారు. దీంతో శత్రుచర్లకు చెక్ పెట్టేందుకు ఇలా చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పలు పార్టీ కార్యక్రమాలకు అదే ప్రాంతంలో ఉన్నా ఎంపీ హాజరు కాలేదు. పార్టీ మండలాధ్యక్షుడు తులసీ వరప్రసాద్ స్వయంగా పిల్చినా ఎంపీ వెళ్లకపోవడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు.
అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ, చిరునవ్వుతో పలకరిస్తూ, మృదుస్వభావిగా పేరొందిన ఎంపీయే ఇలా చేస్తున్నారంటే నమ్మబుద్ధి కావడం లేదని టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేత అన్నారు. నిధుల కేటాయింపులోనూ ఆయన వివక్ష చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ ఇన్‌చార్జిగా కూడా భవిష్యత్తులో తమ వారికే పోస్టు కట్టబెడతామని ఒకటి రెండు చోట్ల ఎంపీ, మంత్రి చెప్పినట్టు తెలుస్తోంది. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడు తానే పాతపట్నం అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని చెబుతుండడం కూడా ఈ ఉదంతాలకు బలమిస్తోంది. మొత్తానికి బాబాయ్, అబ్బాయ్‌లు కొత్తూరులో వర్గాల్ని ప్రోత్సహిస్తున్నారి తేలిపోయిందంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.