
డబ్బులు తీసుకోకుండా ఓటు వేయండి
మంత్రి ఆదినారాయణరెడ్డి
వివాదాస్పద వ్యాఖ్య
ముద్దనూరు : జమ్మలమడుగు నియోజకవర్గాన్ని నంద్యాల కన్నా మెరుగ్గా అభివృద్ధి చేస్తా.. అయితే డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలని మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ముద్దనూరులో జలసిరికి హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో పేదలందరికీ రేషన్‌కార్డులు, పింఛన్లు, గ్యాస్ కనెక్షన్లు, పక్కాగృహాలు మంజూరు చేస్తాం..నంద్యాలతో పాటు అభివృద్ధి చేస్తాం. అయితే డబ్బులు తీసుకోకుండా ఓటు వేయండి.. అభివృద్ధి చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటు వేయొద్దు అని ప్రజలతో అన్నారు. నియోజకవర్గంలో ఫ్యాక్షన్ తగ్గిందన్నారు.
గండికోట ప్రాజెక్టులోకి ఈ ఏడాది తగినన్ని నీరు వస్తే ముద్దనూరు మండలంలోని పలు చెరువులకు కూడా నీటి సరఫరా చేస్తామని తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే గంగాదేవిపల్లె ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టామని, ఈ పథకం మంజూరు కోసం గ్రామస్తులంతా కలసి వస్తే ముఖ్యమంత్రికి వద్దకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన తమకు ఇంతవరకు కూలి డబ్బులు అందలేదని కూలీలు మంత్రికి విన్నవించారు. ఇంకుడు గుంతలు నిర్మించుకోమని అధికారులు చెప్పారని, ఇప్పటివరకు పూర్తయిన ఇంకుడు గుంతలకు బిల్లులు చెల్లించలేదని ఫిర్యాదు చేశారు.ఇరిగేషన్ ఎస్‌ఈ గోపాల్‌రెడ్డి, ఈఈ వెంకట్రావు, డీఈ రాజన్‌బాబు, ఏఈ జాన్సన్, డ్వామా ఏపీడీ మొగిలిచెండు సురేష్, ఎంపీపీ కళావతి, ఎంపీటీసీ సభ్యులు రదారెడ్డి, అపర్ణ, రాజు, రామలక్ష్మి పాల్గొన్నారు.