
గజ్వేల్‌లో ఎడ్లబండిపై ఊరేగింపుగా వస్తున్న మంత్రి హరీశ్‌రావు
అధికారంలో ఉండగా రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడేమో ‘రైతు రణభేరి’ పేరిట దీక్షలు చేపట్టడం
కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్‌రావు ఫైర్
గజ్వేల్: అధికారంలో ఉండగా రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడేమో ‘రైతు రణభేరి’ పేరిట దీక్షలు చేపట్టడం విడ్డూరంగా ఉందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఆయన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. రైతులపై కాంగ్రెస్ నేతలు కపట ప్రేమ కనబరుస్తున్నారని ధ్వజమెత్తారు. ‘ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నడు. వాస్తవాలు మాట్లాడతాడనుకునే జానారెడ్డి సైతం పచ్చి అబద్ధాలే చెబుతుండు’ అంటూ మండిపడ్డారు. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు ఆత్మహత్యకు పాల్పడిన 93 మంది బాధిత కుటుంబాలకు రూ.6 లక్షల ప్యాకేజీ అందించామని పేర్కొన్నారు.
కళ్లు లేనోడికి మాటలతో చెప్పొచ్చు.. చెవులు వినబడనోళ్లకు రాసి చూపించొచ్చు.. అన్నీ ఉన్నా కాంగ్రెస్ నేతలకు ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు కనబడటం లేదో అర్థం కావడం లేదన్నారు. మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలను ఆదుకున్న వివరాలను ఉత్తరం రాసి అందిస్తానని, వీటిని పరిశీలించి అవసరమైతే పునఃపరిశీలన చేసుకోవాలని ఉత్తమ్, జానారెడ్డిలకు సూచించారు. మీరు తిరస్కరించిన రైతు ఆత్మహత్యల బాధిత కుటుంబాల స్థితిగతులపై పునర్విచారణ జరిపి రూ.42లక్షలు పెండింగ్ బకారుులు చెల్లించామని మంత్రి తెలిపారు.
కోర్టుల్లో కేసులు వేయిస్తూ ఎన్ని రకాల కుట్రలు పన్నినా గోదావరి జలాలతో కరువును తరిమికొడతామని చెప్పారు. తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా గజ్వేల్‌లో రూ.కోటిన్నరతో ధాన్యం ఆరబెట్టే యంత్రం (డ్రయ్యర్)ను త్వరలోనే ఏర్పాటు చేరుుస్తామని ప్రకటించారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హరీశ్‌రావు ఎడ్లబండిపై ఎక్కి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుంచి మార్కెట్ యార్డు వరకు ర్యాలీగా వచ్చారు.