
మంత్రి మృణాళినికి చుక్కెదురు
ఆస్పత్రి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిలదీసిన గ్రామస్తులు
చీపురుపల్లి: రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కిమిడి మృణాళినికి సొంత నియోజకవర్గ కేంద్రమైన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎదురు దెబ్బ తగిలింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మించాలని భావించిన మంత్రి మృణాళిని నిర్ణయాన్ని మేజర్ పంచాయతీ పరిధిలో గల వంగపల్లిపేట గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన మంత్రి మృణాళినిని ఈ విషయమై గ్రామస్థులు, మహిళలు నిలదీశారు.
తొలుత మంత్రిని కలిసేందుకు వచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో వారిని తోసుకుని లోపలికి వెళ్లి కార్యాలయంలో బైఠాయించారు. మంత్రి వారివద్దకు వచ్చి దీని కోసం సిక్స్‌మ్యాన్ కమిటీ వేస్తామని చెప్పినప్పటికీ శాంతించని గ్రామస్థులు.. ఏ కమిటీలు వేసినా తమకు ప్రయోజనం లేదని, ఊరు ఖాళీ చేయించి ఆస్పత్రి నిర్మించుకోవాలి తప్ప తాముండగా నిర్మాణం జరగనివ్వమని స్పష్టం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని మహిళలు, గ్రామస్థులను అక్కడి నుంచి పంపించేశారు.