మంత్రి శిద్దాకు దివ్యాంగుల డెడ్లైన్ | Minister sidda to handicapped deadline | Sakshi
Sakshi News home page

మంత్రి శిద్దాకు దివ్యాంగుల డెడ్లైన్

Published Thu, Jul 14 2016 4:21 AM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

మంత్రి శిద్దాకు దివ్యాంగుల డెడ్లైన్

మంత్రి శిద్దాకు దివ్యాంగుల డెడ్లైన్

48 గంటల్లో సమస్యలు పరిష్కరించకుంటే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక
40 శాతంపైన వికలత్వం ఉన్న అందరికీ బస్సు పాసులు ఇవ్వాలని డిమాండ్
మ్యానిఫెస్టో ప్రకారం ప్రతి దివ్వాంగునికి రూ.1500 పింఛన్ ఇవ్వాల్సిందే
రాజకీయ రిజర్వేషన్లు 7 శాతం ఇవ్వాలి.. లేకుంటే గుణపాఠం తప్పదు
అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు

ఒంగోలు : దివ్వాంగుల హక్కులు కాలరాయాలనుకుంటే సహించేది లేదని, 40 శాతం, ఆపైన వికలత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆర్టీసీ బస్సు పాసులు జారీ చేయాల్సిందేనని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక అంబేడ్కర్ భవన్‌లో జిల్లాలోని దివ్యాంగులతో ఆయన సమావేశమయ్యూరు. బస్సు పాసుల వ్యవహారంపై రవాణశాఖ మంత్రి శిద్దా రాఘవరావుకు 48 గంటల డెడ్‌లైన్ ఇస్తున్నామని, ఆ సమయంలోగా ఉత్తర్వులు జారీ చేయకుంటే ఇంటిని ముట్టడించడంతో పాటు అక్కడే తిని, అక్కడే పడుకుంటామని హెచ్చరించారు. చెవిటి, మూగ, అంధుల విషయంలో దొడ్డిదారిన ఆర్టీసీ యాజమాన్యం 100శాతం వికలత్వం ఉంటేనే బస్సు పాసులు జారీ చేస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దివ్యాంగులకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయకుంటే అనంతపురంలో పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఇంటిని సైతం ముట్టడించడం ఖాయమన్నారు. సదరం సర్టిఫికెట్ వికలత్వాన్ని చూపుతుంటే స్థానికంగా నివాసం ఉండడం లేదంటూ ప్రభుత్వం ఇంటి రుణం మంజూరుకు సైతం ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. సదరం సర్టిఫికెట్ల జారీకి సైతం నిధులు లేవంటూ ప్రభుత్వం చేతులెత్తేయడం దారుణమన్నారు. రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలు సేకరిస్తున్న ముఖ్యమంత్రి వికలాంగుల కార్యాలయం కోసం కనీసం 5 సెంట్ల స్థలం కూడా ఇచ్చేందుకు ముందుకు రావడంలేదని కొల్లి విమర్శించారు.

2 వేల పింఛన్లు కట్ చేసిన జన్మభూమి కమిటీలు
రాష్ట్ర అధ్యక్షుడు దూళిపాళ్ల మల్లికార్జునరావు మాట్లాడుతూ 3శాతం రిజర్వేషన్‌లు అంటున్నా కనీసం బ్యాంకు రుణాలు కూడా మంజూరు కావడం లేదన్నారు. టీడీపీ తన మ్యానిఫెస్టోలో వికలాంగులకు రూ.1500లు పింఛన్ ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక 80శాతంపైన వికలత్వం ఉన్న వారికే పింఛన్ ఇస్తామనడం మోసం చేయడమేనన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో జిల్లాలో 2 వేల మందికిపైగా వికలాంగుల పెన్షన్లు రద్దు చేశారని ఆగ్రహించారు. ఆగస్టు 15వ తేదీలోగా సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.

రాజధాని నిర్మాణం పేరుతో ఎన్ని దేశాలు తిరిగినా తాము అభ్యంతరం పెట్టమని, కాకుంటే ముందుగా రాష్ట్రంలో ఉన్న వికలాంగుల సమస్యలను పరిష్కరించేందుకు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండువ వెంకట్రావు, జిల్లా అధ్యక్షుడు వనిపెంట గురవారెడ్డి, అంబటి చవరబాబు, చెన్నుబోయిన సుబ్బారావు, కాలేషా, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మహబూబ్‌బాషా, జిల్లా కార్యదర్శి సోమయ్య, కనిగిరి నియోజకవర్గ కార్యదర్శి వై.మైనర్‌బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement