అత్తార్ ఎమ్మెల్యేనా.. రౌడీనా ?
- అక్రమ కేసులకు భయపడం
- ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం
- కందికుంట అనుచరులు
నల్లచెరువు : ‘‘వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరి నిజమైన టీడీపీ కార్యకర్తలపై కేసులు బనాయిస్తే భయపడేదిలేదు. కదిరి అత్తార్ చాంద్‌బాషా ఎమ్మెల్యేనా లేక రౌడీనా..? ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం.’’ అని మాజీ ఎమ్మెల్యే కందికుంట అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని ఎంపీపీ మాబూసాబ్ మిషన్‌లో ఎంపీపీతో పాటు టీడీపీ మండల కన్వీనర్ దాదెంశివారెడ్డి తదితరులు సోమవారం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 15ఏళ్లుగా పార్టీ జెండాను మోసిన కార్యకర్తలకు టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంటవెంకటప్రసాద్ అండగా ఉన్నారన్నారు. అలాంటి వ్యక్తినికాదని జనచైతన్యయాత్ర ఎలా చేస్తారని వారు ప్రశ్నించారు. ప్రతి మండలంలో ఎమ్మెల్యే గ్రూపులను తయారు చేసి పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. 1983 నుంచి టీడీపీ జెండా మోసిన కార్యకర్తలు మీ దగ్గర ఉన్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన వారు తప్ప నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు లేరని చెప్పారు.అధిష్టానం గుర్తించి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో సింగిల్‌విండో అధ్యక్షులు అంజినప్ప, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి, ఎంపీటీసీ మహబూబ్‌బాషా, కో ఆప్షన్‌సభ్యుడు మస్తాన్, రామసుబ్బమ్మ, లక్ష్మీనారాయణ, మాజీ వైస్ ఎంపీపీ జయరామిరెడ్డి, రాజారెడ్డి, మోహన్‌రెడ్డి, నాగరాజు, ఈశ్వరయ్య, మల్లికార్జుననాయుడు, రమేష్‌నాయుడు, అశ్వర్ధనాయుడు, రఘనాథరెడ్డి, బయారెడ్డి, అబ్దుల్ తదితరులు ఉన్నారు.