అవనిగడ్డ ఆవేదన పట్టని బుద్ధప్రసాద్
అవనిగడ్డ:
అవనిగడ్డ, కోడూరు మండలాల్లో రూ.19 కోట్లతో వేసిన మూడు రహదారులు రెండో రోజే దెబ్బతిన్నా పట్టించుకోని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అ«ధికారులపై కేకలు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు విమర్శించారు. పుష్కరాల్లో రూ.4కోట్లతో నిర్మించిన అవనిగడ్డ–కోడూరు రహదారి పలుచోట్ల దెబ్బతినగా జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావుతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రూ.12.98 కోట్లతో కోడూరు–పాలకాయతిప్ప, రూ.2 కోట్లతో కోడూరు వయా దింటిమెరక–పాలకాయతిప్ప రోడ్లు వేసిన రెండో రోజే దెబ్బతిన్నాయన్నారు. రూ.18. 98 కోట్లతో వేసిన ఈ రోడ్లు రాళ్లు లేచిపోయి, గోతులు ఏర్పడ్డాయని గతంలో ఎన్నడూ లేనివిధంగా వేసిన రోజే రహదారి దెబ్బతిన్న ఘనత స్థానిక ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌కే దక్కుతుందని, ఈ రికార్డును ఎవరూ తిరగరాయలేరని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లు అడ్డంగా పనులు చేసి కోట్లు దోచేసుకుంటున్నా స్ధానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.
రైతుల గోడు పట్టదు, సమస్యలను పట్టించుకోరు
ఈ ఏడాది కోడూరు, నాగాయలంక మండలాల్లో సాగునీరందక ఇంకా 25 వేల ఎకరాల్లో నాట్లు వేయలేదని, ఎమ్మెల్యే వైఫల్యమే కారణమని సింహాద్రి ఆరోపించారు. అటవీ అధికారుల అభ్యంతరాల సాకుతో ఎదురుమొండి–నాచుగుంట, పాలకాయతిప్ప–సాగరసంగమం రహదారి నిర్మాణాలు నిలిచిపోయాయని అన్నారు. నియోజకవర్గంలో అనేక సమస్యలున్నా ఎమ్మెల్యే పట్టించుకోరని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి రాజనాల మాణిక్యాలరావు, నేతలు ఇంకొల్లు శేషగిరి, చింతలపూడి బాలు, తోట శివప్రసాద్, గార్లపాటి గోపీ పాల్గొన్నారు.