నిఖిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
నిఖిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
Published Thu, Aug 25 2016 9:35 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
పమిడిముక్కల :
బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ కన్నెకల మడుగు(డ్రెయిన్)లో మునిగి మరణించిన బాలిక కొండవీటి నిఖిత కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కల్పన గురువారం మేడూరు శివారు ముత్రాసిపాలెం వెళ్లి ఇటీవల కాలువలో పడి చనిపోయిన బాలిక నిఖిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిఖిత తల్లి కామాక్షి, తండ్రి నానీలను ఓదార్చారు. ప్రమాద కారణాలు అడిగి తెలుసుకున్నారు. వీరంకి వద్ద బందరు కాలువకు గండి పడటంతో నీటిని కన్నెకల మడుగు డ్రెయిన్‌కు వదిలారని గ్రామస్తులు చెప్పారు. రేవులో బట్టలు ఉతికేందుకెళ్లిన ముగ్గురు బాలికలు నీటి ఒరవడికి కొట్టుకుపోతుండగా... స్థానికులు ఇద్దరిని రక్షించారని, నిఖిత మరణించిందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కల్పన విలేకరులతో మాట్లాడుతూ అధికారులు, సాగునీటి సంఘాల అలసత్వం వల్లే వీరంకి వద్ద కాలువ కట్టకు గండి పడిందని, నిఖిత మరణించిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగమంతా పుష్కరాల హడావుడిలో నిమగ్నమై పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. బాలిక కుటుంబానికి తమ పార్టీ తరఫున అండగా నిలుస్తామని, నష్టపరిహారం అందించే వరకు పోరాడతామని చెప్పారు. మాజీ ఎంపీపీ శొంఠి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ తోట్లవల్లూరు మండల అధ్యక్షుడు జొన్నల రామ్మోహనరెడ్డి, నాయకులు మారపాక మహేష్, పాతూరి చంద్రపాల్, లోయ బ్రదర్స్, జి.రాజ్యలక్ష్మి, ఎం.వసంత, నజీర్, సలీం, కుటుంబరావు, పి.రవికుమార్, డి.మల్లికార్జునరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement