
‘రాజధాని’కి ఇసుక ఎక్కడ నుంచి తెస్తారు?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే ఆర్కే
తాడేపల్లి రూరల్: రాజధాని చుట్టుపక్కల ఉన్న ఇసుక మొత్తాన్ని రెండేళ్లలో టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు దోచేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి ఇసుక ఎక్కడి నుంచి తెస్తారని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘రాజధానిలో ఉన్న ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం తదితర ప్రాంతాల్లో భారీ యంత్రాలను ఉపయోగించి పడవల ద్వారా ఉన్న ఇసుకను అంతా తోడేశారు.
ఇప్పుడు అక్కడ డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తీస్తుంటే మట్టిముద్దలు, సిల్టు తప్ప ఇసుక రావడం లేదు. ప్రభుత్వం తన అనుయాయులను సంపన్నులను చేసేందుకు ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది. చిర్రావూరు ఇసుక రీచ్‌పై వైఎస్సార్‌సీపీ పార్టీ పోరాటాలు నిర్వహించడంతో దానిని పక్కన పెట్టి, కొత్తగా గుండిమెడ క్వారీలో ఇసుకను దోచుకునేందుకు అతి తక్కువ ధరకు ప్రభుత్వం తమ్ముళ్లకు అప్పగించింది. తమ పార్టీ నాయకులకు దోచిపెట్టేందుకే ప్రభుత్వం ఈ పాటలు నిర్వహించింది’ అని ఆయన పేర్కొన్నారు.