
సాక్షి, హైదరాబాద్ : చట్టాలను పరిరక్షించాల్సిన డీజీపీయే వాటిని ఉల్లంఘిస్తూ భూకబ్జాలకు పాల్పడితే ఎలా?.. అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అక్రమంగా హైదరాబాద్‌లో ఇంటి నిర్మాణం చేపట్టారని ఆయన హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు ధర్మాసనం జీహెచ్‌ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆక్రమణలు తొలిగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణరెడ్డి పార్టీ కేంద్రకార్యలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఏపీ డీజీపీ ఇంటి అక్రమనిర్మాణంపై హైకోర్టు తీర్పును వైఎస్సార్‌సీపీ స్వాగతిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు అండగా ఉన్నారని ఠాకుర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 2010లో డీజీపీ ఠాకుర్ ప్లాన్ అనుమతికి దరఖాస్తు చేసుకున్నారని, జీహెచ్‌ఎంసీ పర్మిషన్ రాకున్నా ఇంటి నిర్మాణం చేపట్టారని తెలిపారు.
అక్రమ నిర్మాణ నిర్మించడమే కాకుండా పార్క్ స్థలాన్ని కూడా ఆక్రమించారన్నారు. భారీ ఇంటి నిర్మాణ చేపట్టిన డీజీపీకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ నిర్మాణం విషయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటికే 2 నోటీసులు ఇచ్చారని, ఆ నోటీసులను డీజీపీ ఉల్లంఘించారన్నారు. డీజీపీనే చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. పసిపిల్లలు ఆడుకునే పార్క్‌ను కూడా అడ్డంగా కబ్జా చేస్తారా? అని నిలదీశారు. న్యాయాన్ని కాపాడుకునేందుకు మేం కోర్టుకు వెళ్లామని, చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత ఓ డీజీపీగా ఠాకుర్ ఉందా లేదా? అని ప్రశ్నించారు. అవినీతి చేస్తూ చట్టాలను కాపాడతామని అబద్ధాలు చెబుతున్నారని, పోలీస్ బాస్ అయితే ఆక్రమణలు చెల్లుతాయా? అని మండిపడ్డారు. ఇక హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72 ప్రశాసన్‌నగర్‌లో డీజీపీ ఆర్పీ ఠాకూర్ (ప్లాట్ నం.149) జీహెచ్‌ఎంసీ పార్కును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను మంగళవారం జీహెచ్‌ఎంసీ సర్కిల్–18 టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు.
Comments
Please login to add a commentAdd a comment