
నేడు ఎమ్మెల్యే రోజాచే సైకిళ్ల పంపిణీ
మండల పరిధిలోని దొరసానిపల్లె జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సొంత నిధులతో నిర్వహించే సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి మంగళవారం నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, సినీ నటి ఆర్.కె.రోజా రానున్నట్లు పార్టీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్ తెలిపారు.
– ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సొంత నిధులతో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ
ప్రొద్దుటూరు క్రైం: మండల పరిధిలోని దొరసానిపల్లె జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సొంత నిధులతో నిర్వహించే సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి మంగళవారం నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, సినీ నటి ఆర్.కె.రోజా రానున్నట్లు పార్టీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్ తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొరసానిపల్లె జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థినులు చాలా మంది ఉన్నారని చెప్పారు.
విద్యార్థినుల సమస్యపై స్పందించిన రాచమల్లు
నరసింహాపురం, కొత్తపేట, చౌటపల్లె, రామాపురం తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేనందున విద్యార్థినులు కాలినడకన పాఠశాలకు వస్తున్నారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తామని ప్రకటించారని, ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లయినా రాష్ట్రంలో ఒక్క సైకిల్ కూడా పంపిణీ చేయలేదన్నారు. విద్యార్థినులు తమ సమస్యను ఎమ్మెల్యే రాచమల్లు దృష్టికి తేవడంతో స్పందించిన ఆయన తన సొంత నిధులతో విద్యార్థినులకు 50 సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి రోజా హాజరువుతున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా విజయలక్ష్మి, మండల కన్వీనర్ దేవిప్రసాద్, నాయకుడు బలిమిడి చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు.