ఇది మాటల ప్రభుత్వమే.. చేతలది కాదు | Mla roja fires on kcr | Sakshi
Sakshi News home page

ఇది మాటల ప్రభుత్వమే.. చేతలది కాదు

Published Sun, Nov 15 2015 1:40 AM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

ఇది మాటల ప్రభుత్వమే.. చేతలది కాదు - Sakshi

ఇది మాటల ప్రభుత్వమే.. చేతలది కాదు

♦ హామీలతో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న కేసీఆర్
♦ నక్సలైట్ల ఎజెండా అని.. ఎంటెక్ విద్యార్థిని హత్యచేశారు
♦ రైతులు చనిపోతే రాని మంత్రులు ఓట్ల కోసం పరుగులు పెడుతున్నారు
♦ వరంగల్ జిల్లాలోని పలు రోడ్‌షోల్లో నగరి ఎమ్మెల్యే రోజా
 
 శాయంపేట, ఆత్మకూరు, రేగొండ, గణపురం: ఇది మాటల ప్రభుత్వమని.. చేతల ప్రభుత్వం కాదనే విషయం ఇప్పటికే ప్రజలకు అర్ధమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా అన్నారు. కేసీఆర్ మాటలు విని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే 17 నెలలుగా ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ సీపీ తరఫున పోటీచేస్తున్న నల్లా సూర్యప్రకాశ్‌కు మద్దతుగా రోజా శనివారం శాయంపేట, ఆత్మకూరు, రేగొండ, గణపురం, భూపాలపల్లి, చిట్యాల మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు.

ఆయూ ప్రాంతాల్లో రోజా మాట్లాడుతూ కేవలం కేసీఆర్ అహంకార ధోరణితోనే ఉప ఎన్నిక వచ్చిందని, కేసీఆర్ చెప్పు చేతుల్లో ఉండే వారిని మంత్రులుగా ఉండాలనే దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి తనకు అనుకూలంగా ఉండే కడియం శ్రీహరిని ఎంపీ పదవికి రాజీనామా చేయించి పదవిని ఇచ్చి.. ఈ ఉప ఎన్నికలకు తెరతీశారన్నారు. ఈ ఎన్నికల్లో అయ్యే ఖర్చంతా ఎవరు భరించాలని ఆమె ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉందన్నారు. ఈ ఉప ఎన్నిక వల్ల ప్రజలకు రూపాయి ఉపయోగం లేకపోవడమేగాక పన్నుల రూపంలో భారం పడుతుందన్నారు.

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ప్రజలపై భారంమోపి మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్న కేసీఆర్‌కు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. నక్సలైట్ ఎజెండా టీఆర్‌ఎస్ పార్టీ ఎజెండాగా చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి రాగానే ఎంటెక్ విద్యార్థిని శ్రుతిని చిత్రహింసలకు గురిచేసి హత్యచేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు మాటలు చెప్పి ఎన్నికల తరువాత మాట్లడని తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులది ఏరుదాటకముందు ఏటి మల్లన్న..  ఏరుదాటాక బోడి మల్లన్న అనే రీతిలో ఉందని విమర్శించారు. కేసీఆర్, చంద్రబాబు పాలన ఒకే నాణేనికి రెండు బొమ్మలలాంటిదని అన్నారు.

రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పల్లెల్లోకి రాని మంత్రులు.. ఈ రోజు ఎన్నికలు అనగానే ఓట్ల కోసం గ్రామాల్లో పరుగులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు అధికారపార్టీకి ఓట్లేస్తే ‘మేము చేసే తప్పులన్నీ  రైటే, అందరు మావైపే ఉన్నారు’ అన్న ధోరణిలో వచ్చే మూడేళ్లు పాటు గ్రామాల్లో ఎవరూ కనిపించరని, వారు చేసే పనులు కూడా చేయరని రోజా అన్నారు. తెలంగాణలో రైతన్నలు చనిపోతుంటే, విద్యార్థులు నలిగిపోతే, మహిళలు, వికలాంగులు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఏఒక్క పేదవాడికైనా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇల్లు కట్టించిందా? అని ప్రశ్నించారు.

వైఎస్సార్ హయాంలో 47లక్షల ఇళ్లు కట్టించారని, కానీ, ఇద్దరు చంద్రులకు పేకమేడలు కట్టడమే సరిపోతున్నదని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలు కేసీఆర్‌తో జతకట్టారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలవి నీతీమాలిన రాజకీయాలని, కాంగ్రెస్ నాయకుడు సిరిసిల్ల రాజయ్య కోడలు, మనువళ్ల సజీవ దహనం ఘటన వారి క్యారక్టర్‌కు నిదర్శనమన్నారు. వైఎస్ హయాంలో ప్రతి వెయ్యి మందికి ఒక ఆశ కార్యకర్తను ఏర్పాటు చేశారని, అలాంటి ఆశలను ఇప్పుడున్న ప్రభుత్వం వారి కష్టాలను చెప్పుకునే అవకాశం కూడా కల్పించకపోవడం బాధాకరమన్నారు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్ నిలిచిపోయి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, సర్టిఫికెట్లురాని పరిస్థితి ఉందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపుచేయడంలో ప్రభుత్వం విపలమైందన్నారు.

పత్తికి గిట్టుబాటు ధరలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 50 శాతం ఉన్న మహిళలకు ఒక్క మంత్రి పదవి కూడా కేటాయించని కేసీఆర్.. కేవలం 20 మంది సభ్యులున్న ఆయన కుటుంబలో మాత్రం సీఎం, రెండు మంత్రి పదవులు,  ఎంపీ పదవి తీసుకున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌కు, సీఎం కేసీఆర్‌కు బుద్ధి వచ్చే విధంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు ఓట్లేసి గెలిపించాలని రోజా కోరారు. రోడ్‌షోలో అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్, కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పలేటి కల్పన, ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement