
1998క్వాలిఫైడ్ టీచర్లు ఎమ్మెల్సీ బరిలోకి
వారి సమస్యలను వారే పరిష్కరించుకునే దిశగా
రెండు నియోజకవర్గాల నుంచి పోటీ
రానున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1998క్వాలిఫైడ్ టీచర్లు బరిలోకి దిగుతున్నారు. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను పోటీలోకి దింపుతున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు మారినా తమ బతుకులు మారలేదని, తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడుగుపెడుతున్నామని వారు చెబుతున్నారు.
తిరుపతి ఎడ్యుకేషన్ : 1998లో రాష్ట్ర వ్యాప్తంగా 36,136 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. మొదటి లిస్టు ద్వారా 20వేల పోస్టులు, రెండో లిస్టు ద్వారా 5 వేల పోస్టులు భర్తీ చేశారు. అర్హత ఉన్నప్పటికీ మిగిలిన పోస్టులను భర్తీ చేయకపోవడంతో 11వేల మందికి పైగా 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్లు 18 ఏళ్లుగా ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లాలో డీఎస్సీ-98 ద్వారా 1,827 పోస్టులకు గాను రెండు విడతల్లో 1,221 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. మిగిలిన 606 పోస్టులు నేటికీ భర్తీ చేయలేదు. వీరందరూ ప్రభు త్వ కొలువు వస్తుందనే ఆశతో ఎదురుచూశారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రులు, మంత్రుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా సాంకేతిక కారణాలను సాకుగా చూపి సమస్య తీర్చలేదు. ఎన్నికల ముందు 1998 క్వాలిఫైడ్ టీచర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచాక వీరిని పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
రెండు నియోజకవర్గాల నుంచి పోటీ..
పట్టభద్రుల ఎమ్మెల్సీగా 1998 క్వాలిఫైడ్ టీచర్లు బరిలోకి దిగుతున్నారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇద్దరు అభ్యర్థులు ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నారు. తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడం కోసం పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీ చేయనున్నట్లు వారు చెబుతున్నారు.
ఎమ్మెల్సీగా గెలిస్తే..
పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే డీఎస్సీ-98, ఇతర డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్లకు ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పించడానికి కృషి చేస్తామని, పట్టభద్రులందరికీ ఉద్యోగం/స్వయంఉపాధి/నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని చెబుతున్నారు. రైతులకు సబ్సిడీ ద్వారా నాణ్యమైన విత్తనాలు ఇప్పించడంతో పాటు గిట్టుబాట ధర కల్పిస్తామని అంటున్నారు. మహిళలకు ప్రభుత్వ కొలువుల్లో 33.50శాతం రిజర్వేషన్, ప్రత్యేక ప్రతిభావంతులకు 3శాతం రిజర్వేషన్ కల్పించడానికి కృషి చేస్తామని పేర్కొంటున్నారు.
సమస్యల పరిష్కారం కోసమే
డీఎస్సీ-98లో అర్హత సాధించాం. అరుుతే మాలో కొందరికి ఉపాధ్యాయ పోస్టులివ్వలేదు. 18 ఏళ్లు నుంచి న్యాయపోరాటం చేసినా, ప్రజాప్రతినిధులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. మా సమస్యలను మేమే పరిష్కరించుకోవడం కోసం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాం.
- ఎం.గోవిందరాజు, 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్
ఏకమై గెలిపించాలి
ప్రభుత్వాలు మారినా సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నారుు. ఉద్యోగం లేదు. నిరుద్యోగ భృతి లేదు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు నీటి మూటలే అయ్యారుు. మన సమస్యల పరిష్కారం కోసం క్వాలిఫైడ్ టీచర్లు, నిరుద్యోగ పట్టభద్రులందరూ ఏకమై డీఎస్సీ-98 క్వాలిఫైడ్ టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలి.
-డి.ధర్మలింగారెడ్డి, 1998డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్