చితుకుతున్న బతుకులు | money problems | Sakshi
Sakshi News home page

చితుకుతున్న బతుకులు

Published Tue, Nov 29 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

చితుకుతున్న బతుకులు

చితుకుతున్న బతుకులు

  • కరెన్సీ కల్లోలం.. పెను సంక్షోభం 
  • వాయిదా పడుతున్న పెళ్లిళ్లు
  • ఇతర శుభకార్యాలదీ అదే దారి
  • చితికిపోయిన చిన్నవ్యాపారాలు
  • కొనేవారు లేక కళ తప్పిన పెద్ద వ్యాపారాలు
  • సొమ్ములు లేక రైతుల ఇక్కట్లు
  • పెళ్లిబాజాలు మోగాల్సిన ఇంట.. మామిడితోరణాలు కట్టాలా.. వద్దా.. అని ఆలోచిస్తున్నవారే కనిపిస్తున్నారు. ఒకవేళ అనుకున్న ముహూర్తానికే ఆ శుభకార్యం తలపెడితే.. డబ్బులు సర్దుబాటు చేయడమెలాగన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.
     
    కుటుంబ పరిస్థితులు అనుకూలించకో.. పెద్ద పెద్ద స్థానాలకు ఎదిగే శక్తి లేకో.. కాలం కలసిరాకో.. ఉన్నంతలోనే చిన్నచిన్న వ్యాపారాలతో బతుకుబండిని లాగిస్తున్నవారు.. పెద్ద నోట్ల రద్దుతో కొన్నాళ్లుగా బేరాలు లేక దారుణమైన నష్టాలు చవిచూస్తున్నారు. తెల్లవారితే చాలు.. ఆ రోజు ఎలా గడపాలో అర్థం కాక కలత చెందుతున్నారు.
     
    పండగలు వచ్చేస్తున్నవేళ.. కొనుగోలుదార్లతో కిటకిటలాడాల్సిన పెద్దపెద్ద షాపులు.. కనీస వ్యాపారం కూడా జరగక కళ తప్పుతున్నాయి. వ్యాపారం లేకపోవడంతో ఆయా యాజమాన్యాలు తమవద్ద పని చేస్తున్న చిరుద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
     
    నేలతల్లిని తన చెమటతో తడిపి.. బంగారుపంటలు పండించి.. ప్రజలందరికీ తిండిగింజలను అందించే అన్నదాతలు.. ఖరీఫ్‌ వరి కోతల సమయాన.. చేతిలో సొమ్ములాడక.. రబీ పెట్టుబడులు ఎలా సమకూర్చుకోవాలో అర్థం కాక బావురుమంటున్నారు.
     
    మరోపక్క పనులు లేక.. చేసినా చిల్లర నోట్లు రాక.. కొత్త రూ.2 వేల నోటుకు చిల్లర దొరకక రోజు కూలీలు నానా అవస్థలూ పడుతున్నారు.
     
    ఒకటో తేదీ వచ్చేస్తోంది. ఇంటద్దె, కిరాణా, పాలబాకీలు.. ఇతర ఖర్చులకు డబ్బులు అందుతాయో లేదో అర్థంకాక సగటు ఉద్యోగులు తల్లడిల్లుతున్నారు.
     
    పాత రూ.వెయ్యి, రూ.500 నోట్లు చిత్తు కాగితాలతో సమానమంటూ ప్రధాని ప్రకటించి ఇప్పటికి 22 రోజులు పూర్తయింది. ఇప్పటికీ కరెన్సీ కల్లోలం ప్రజాజీవితాన్ని 
    పెను సంక్షోభంలోకి నెట్టేసింది. మోదీ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో తమ జీవితాలు చిత్తయ్యాయని.. తక్షణం ఈ కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని అన్ని వర్గాల ప్రజలూ గళమెత్తుతున్నారు.
     
    చిల్లర ఎక్కడ నుంచి తేవాలి?
    నోట్ల రద్దుతో రూ.500, రూ.1000 తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో రూ.100 మిఠాయి కొనుగోలుకు కూడా రూ.2 వేల నోటు ఇస్తున్నారు. వారికి చిల్లర ఎక్కడ నుంచి తీసుకురావాలో అర్థం కావడం లేదు. దుకాణంలో మిఠాయి తయారు చేయడానికి కనీసం ముగ్గురు కూలీలు కావాలి. వారికి రోజువారీ జీతాలు ఇచ్చేంత స్థాయిలో కూడా అమ్మకాలు సాగడం లేదు. వారికివ్వడానికి చిల్లర ఉండటం లేదు. అలాగని సెలవు ఇస్తే వారు మరో పనిలోకి పోతారు. దీంతో అనుభవం కలిగిన పనివారిని వదులుకోలేకపోతున్నాం. పప్పుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. వ్యాపారం లేకపోయినా అద్దెలు, కరెంటు బిల్లులు, కార్మికుల కూలీలు చెల్లించకతప్పడం లేదు. నోట్ల రద్దుతో సామాన్యుల నోట్లో మట్టి పడింది.
    – మిత్తిపాటి మాధవరావు, చిరు మిఠాయి వ్యాపారి, సామర్లకోట
     
    డిసెంబరులో ముహూర్తమా?
    ‘మంచి ముహుర్తమైనా... బలమైన మూహూర్తమైనా ఈ రెండు నెలలూ పెళ్లిళ్లు చేయలేం. నోట్ల గందరగోళం తగ్గిన తరువాత చిన్న ముహూర్తమైనా పెళ్లి చేద్దాం. అంతవరకూ వాయిదానే’
     
    పెద్దనోట్ల రద్దుతో చాలామంది పెళ్లి పెద్దలు, తల్లిదండ్రులు గత్యంతరం లేని పరిస్థితుల్లో తీసుకుంటున్న నిర్ణయం ఇది. ఈ నెలలో పెట్టిన ముహూర్తాలు, వచ్చే నెలలో పెళ్లిళ్లు పెట్టుకుని, ఇప్పటికే బంధుమిత్రులకు శుభలేఖలు పంచినవారు మినహా తాజాగా పెళ్లిళ్లు కుదిరినవారంతా ఆ శుభకార్యాలను కాస్త ఆలస్యంగా జరుపుకోవాలని నిశ్చయించుకుంటున్నారు. పెద్దనోట్ల రద్దుతో వంటవాళ్లు, పురోహితులు, విద్యుద్దీపాలు అలంకరించేవారు, కల్యాణ మండపాలవారు, డెకరేష¯ŒS చేసేవారిని ఏర్పాటు చేసుకోవడంతోపాటు.. చివరకు విందు భోజనాలకు అవసరమైన సరుకులు కొనేందుకు సహితం పెళ్లి నిర్వాహకులు అష్టకష్టాలు పడుతున్నారు. పెద్ద నోట్లు మారకపోవడం, చిన్న నోట్లు లక్షల్లో పోగు చేయలేక ముహూర్తాలను వాయిదాలు వేసుకుంటున్నారు. వచ్చే నెల 3, 4, 5, 7, 9 తేదీలతోపాటు 24న కూడా ముహూర్తాలున్నాయి. వీటిలో 3, 4, 5 తేదీల్లోవి భారీ ముహూర్తాలు. నోట్ల రద్దు గొడవ లేకుంటే ఈ మూడు రోజుల్లో జిల్లావ్యాప్తంగా కనీసం 50 వేలకు పైగా పెళ్లిళ్లు జరిగేవి. వీటితోపాటు గృహప్రవేశాలు, ఇతర శుభకార్యక్రమాలు జరగాల్సి ఉంది. కరెన్సీ సంక్షోభంతో ఈ కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు. పుష్యమాసం కావడంతో జనవరి నెల 30 వరకూ ముహూర్తాలు లేవు. అదిగో ఇదిగో అంటే ఇక ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే పెళ్లిబాజా ఘనంగా మోగే అవకాశముంది. కొత్తగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసినవారు మాత్రం డిసెంబరు నెలలో పాలు పొంగించుకుని తరువాత ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంగా విందు ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
    – అమలాపురం
    డిసెంబరు వద్దంటున్నారు
    డిసెంబరు నెలలో బలమైన ముహూర్తాలున్నా చాలామంది ఫిబ్రవరిలో చూడమంటున్నారు. జనవరిలో ముహూర్తాలు లేనందున గతంలో పెళ్లిళ్లు కుదిరితే వారం రోజుల వ్యవధిలో కూడా ముహూర్తాలు పెట్టుకున్న సందర్భముంది. పెద్ద నోట్లు మారకపోవడంతో వారంతా ఫిబ్రవరిలో ముహూర్తాలకు మొగ్గు చూపుతున్నారు.
    – ఉపద్రష్ట నాగ ఆదిత్య, పురోహితుడు, అమలాపురం, తూర్పు గోదావరి జిల్లా
     
    శుభలేఖ చూపినా రూ.2వేలే ఇచ్చారు
    ఆమె పేరు ఎ¯ŒS.విజయలక్ష్మి, రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్‌ జనరల్‌ ఆస్పత్రిలో పని చేస్తూంటారు. తన కుమార్తెకు డిసెంబర్‌ ఒకటిన వివాహం చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఇందుకోసం సమీపంలో ఉన్న ఆంధ్రాబ్యాంకులోని తన అకౌంటులో దాచుకున్న రూ.80 వేలు తీసుకునేందుకు వెడ్డింగ్‌ కార్డుతోపాటు బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నారు. వివాహాది శుభకార్యాలకు తగిన ఆధారాలు చూపిస్తే రూ.2 లక్షల వరకూ నగదును పొందవచ్చని ఆదేశాలున్నాయి. కానీ, అందరితోపాటే ఆమెకు కూడా బ్యాంకు సిబ్బంది రూ.2 వేలే చెల్లించారు. కుమార్తె వివాహం కోసం సొమ్ములు కావాలని ప్రాధేయపడినా సిబ్బంది వినలేదు. ఈ రూ.2 వేలతో పెళ్లి ఏర్పాట్లు ఏవిధంగా చేసుకునేదంటూ నిలదీసినా వారు పట్టించుకోవడంలేదు. దీంతో ఆమె కన్నీటిపర్యంతమవుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఆదేశాలనే తాము పాటిస్తున్నామని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాల క్యాంపస్‌లోని ఆంధ్రాబ్యాంకు బ్రాంచ్‌ మేనేజర్‌ రాధాకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ఆధారాలు చూపించినా కావలసినంత మేరకు నగదు ఇవ్వలేని స్థితిలో తమకు కేటాయింపులు ఉంటున్నాయన్నారు. రోజుకు రూ.4 లక్షలే తమకు కేటాయిస్తున్నారని, దీనిని ఎంతమందికి ఏవిధంగా చెల్లించగలమంటూ తన నిస్సహాయత వ్యక్తం 
    చేశారు.
    – రాజానగరం
     
    చిన్న వ్యాపారులకు  పెద్ద కష్టం
    అమలాపురం : పెద్ద నోట్ల రద్దుతో చిన్నవ్యాపారులు విలవిలలాడుతున్నారు. అమలాపురం నియోజకవర్గంలో సుమారు వెయ్యిమంది చిరు వ్యాపారులున్నారు. ఒక్క అమలాపురం పట్టణంలోనే సుమారు 450 మంది వ్యాపారులున్నారని అంచనా. పెద్దనోట్ల రద్దుతో వారికి చిల్లర కష్టాలు మొదలయ్యాయి. పట్టణ పరిధిలో తోపుడుబళ్ల మీద కూరగాయలు అమ్ముకునేవారి వ్యాపారం సగానికి సగం తగ్గింది. ‘‘ఇంతకుముందు రోజుకు రూ.3,500కు పైగా పండ్ల అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు రూ.1,500 కూడా జరగడం లేదు’’ అని పట్టణానికి చెందిన పండ్ల వ్యాపారి రంకిరెడ్డి రామదేవుడు వాపోయారు. ‘‘రూ.100 నోట్లు దొరికితేనే మావద్ద ఎంతోకొంత కిరాణా కొంటున్నారు. లేకపోతే అత్యవసరమైతేనే కానీ కొనడం లేదు. పెద్దనోటు ఉంటే బజారుకు పోతున్నారు. మా దుకాణంలో రోజుకు రూ.2,500 పైబడి అమ్మకాలు సాగేవి. ఇప్పుడు రూ.వెయ్యి దాటితే గొప్పగా ఉంది’’ అని అమలాపురం మండలం రోళ్లపాలేనికి చెందిన కిరాణా వ్యాపారి ఆనందరావు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో గోల్డ్‌ మార్కెట్‌కు కస్టమర్లు రాక.. దానిపై ఆధారపడిన పా¯ŒSషాపు, టీకొట్ల యాజమానుల వ్యాపారాలు సైతం సగానికి తగ్గాయి. వాయిదాల పద్ధతిలో సామాన్యులకు వస్రా్తలు అమ్మే వ్యాపారులదీ ఇదే పరిస్థితి. ‘‘మాకు ఇవ్వాల్సినవారు సమయానికి వాయిదా సొమ్ము ఇవ్వడం లేదు. షాపు యజమానులు మాత్రం వెంటనే సొమ్ములిమ్మంటున్నారు. అప్పులు చేయాల్సి వస్తోంది’’ అని ఉప్పలగుప్తం మండలం వాడపర్రుకు చెందిన వస్త్ర వ్యాపారి సీహెచ్‌ నాగరాజు చెప్పాడు.
     
    గంటల తరబడి క్యూలో నిలబడితే.. రెండు మూడు వేలే ఇస్తారా?
    బోట్‌క్లబ్‌ (కాకినాడ) : పనులు మానుకొని గంటల తరబడి క్యూలో నిలబడితే రెండు, మూడు వేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో బ్యాంకు సిబ్బందిపై ఖాతాదారులు మండిపడ్డారు. కాకినాడ సూర్యారావుపేట ఆంధ్రాబ్యాంకు వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ‘‘నాలుగు గంటలకు పైగా క్యూలో నిలబడితే రూ. 3 వేలు మాత్రమే ఇచ్చారు. ఉదయం 9 గంటలకే బ్యాంకుకు వచ్చాను. మధ్యాహ్నం 12 గంటలకు కూడా నగదు ఇవ్వలేదు’’ అని మహాలక్ష్మి అనే గృహిణి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తమవద్ద పూర్తిస్థాయిలో నగదు లేనందువల్లనే పూర్తి స్థాయిలో చెల్లింపులు జరపలేకపోతున్నామని, ఉన్న నగదునే అందరికీ సర్దుతున్నామని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉండగా, నెలాఖరు కావడంతో నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు అవసరమైన డబ్బుల కోసం మళ్లీ బ్యాంకులకు పరుగు తీస్తున్నారు. దీంతో బ్యాంకులవద్ద మళ్లీ రద్దీ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో సూర్యారావుపేట ఆంధ్రాబ్యాంకు సిబ్బంది ఖాతాదార్లకు టోకెన్లు జారీ చేశారు. వీటిని తీసుకునేందుకు ఖాతాదారులు ఎగబడడంతో ఒక్కసారిగా తోపులాట జరిగి, పలువురు గాయపడ్డారు.
     
    కడియపులంకలో వాడిపోతున్న ‘పూలు’
    కడియం : పెద్ద నోట్ల రద్దు కడియపులంక పూల మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిల్లర అమ్మకాలు 70 శాతం వరకూ తగ్గిపోయాయి. రోజూ రూ.2 వేల వరకూ పువ్వులు తీసుకువెళ్లి చిల్లరగా అమ్ముతానని, కానీ కొనుగోలుదారుల వద్ద తగిన నోట్లు లేకపోవడంతో అరువులు పెడుతున్నారని అనపర్తికి చెందిన పూల వ్యాపారి సుబ్బారావు తెలిపారు. నిత్యం తనవద్ద కొనేవారికి మాత్రమే పూలు ఇస్తున్నానని, ఇందుకోసం రూ.500 నుంచి రూ.800 వరకూ కొనుగోలు చేస్తున్నానని చెప్పారు. చిల్లర నోట్లు లేకపోవడంతో పెద్ద నోట్లే ఇస్తామని వ్యాపారులు చెబుతూండగా, అందుకు మార్కెట్‌కు పువ్వులు తెచ్చిన రైతులు అంగీకరించడంలేదు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో పట్టీ (సరఫరా చేసిన పూలకు చెల్లింపు) పట్టుకెళ్లే రైతులు వారం రోజులపాటు వేచి చూడాల్సి వస్తోంది. మార్కెట్‌లోకి పువ్వులు విరివిగా వస్తున్న ప్రస్తుత తరుణంలో చిల్లర కష్టాలతో అమ్మకాలు పడిపోతున్నాయి. గత ఏడాది ఇదే రోజుల్లో కేజీ రూ.80 వరకూ పలికిన పలు రకాల పువ్వులు ఇప్పుడు రూ.25 నుంచి రూ.40 మధ్య మాత్రమే పలుకుతున్నాయని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement