- ఏటీఎంల వద్ద గడిచిపోతున్న కాలం
- నగదు అందక తీవ్ర ఇబ్బందులు పడతున్న ప్రజలు
- జిల్లాకు నగదు సరఫరా అంతంత∙మాత్రమే
- తీరని చిల్లర కొరత
మ‘నీరసం’
Published Mon, Dec 12 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM
సాక్షి, రాజమహేంద్రవరం :
పెద్దనోట్లు రద్దు చేసి నెల రోజులు దాటుతున్నా నగదు కొరత సమస్య తీరడం లేదు. నెల రోజులుగా ప్రజలు జీవితంలో సగ భాగం బ్యాంకులు ఏటీఎంల వద్ద నిల్చోవడానికే సరిపోయింది. ఆర్బీఐ నుంచి జిల్లాకు అవసరమైన నగదు సరఫరా కాకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. ఇక మూడు రోజుల నుంచి బ్యాంకులకు సెలవులు కావడంతో సోమవారం కూడా ప్రజలు నగదు కోసం ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. జిల్లాలోని 931 ఏటీఎంలలో ఐదు శాతం మాత్రమే పని చేశాయి. రాజమహేంద్రవరంలో మూ డు ఎస్‌బీఐ, ఒక హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలలో మాత్రమే నగదు లభిస్తుండడం నగదు కొరతకు తార్కాణం. ప్రజలు కాళ్లరిగేలా నగదు ఎక్కడ లభిస్తుందోనని వెతుకుతున్నారు. నగదు ఉన్న ఏటీఎంల వద్ద చాంతాడంత క్యూలుంటున్నాయి. చివరకు గంటల తరబడి క్యూలో నిల్చుంటే రూ.రెండు వేలు అందడం కూడా గగమనమవుతోంది. శనివారం జిల్లాకు వచ్చిన రూ.80 కోట్లలో రూ.500 నోట్లున్నాయి. ఎస్‌బీఐ ఏటీఎంలలో ఇవి లభిస్తున్నాయి.
ఆ 80 కోట్లూ ఏ మూలకు?
శనివారం జిల్లాకు రూ.80 కోట్లు రావడంతో ఈ మొత్తాన్ని ఆయా బ్యాంకులకు పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 756 బ్యాంకులు ఉన్నాయి. రూ.80 కోట్లు ప్రస్తుతం అవసరాలకు ఏమాత్రం సరిపోవు. సాధారణంగా ఒక లీడ్ బ్యాంక్‌లో రోజుకు రూ.200 కోట్ల నగదు నిల్వలు ఉండాలని ఓ బ్యాంకు అధికారి చెప్పారు. ఇలాంటి లీడ్ బ్యాంకులు జిల్లాలో 36 ఉన్నాయి. చేసేది లేక వచ్చిన నగదునే బ్యాంకులు అందరికీ సర్దుతున్నాయి. వారానికి రూ.24 వేలు తీసుకునే అవకాశం ఉన్నా ఆ మేరకు నగదు లేకపోవడంతో పరిమితులు విధించి ఇస్తున్నాయి. ఖాతాల్లో నగదు ఉన్నా తీసుకునే అవకాశం లేక ప్రజలు బ్యాంకు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. మరికొన్నిచోట్ల అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేస్తున్నారు. 3 రోజుల సెలవుల తర్వాత బ్యాంకు లు మంగళవారం తెరచుకోనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందోనని బ్యాంకు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిల్లర కష్టాలు ఇంకా తొలగలేదు. రూ.2 వేల నోటుకు చిల్లర దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సినిమా థియేటర్లకు రూ.రెడు వేల నోట్ల సెగ తగులుతోంది. సోమవారం రాజమహేంద్రవరానికి చెందిన సురేష్ ఇటీవల విడుదలైన చిత్రం టికెట్ల కోసం లైన్లో నిల్చున్నారు. రూ.110 టిక్కెట్లు పది తీసుకుని రూ.2 వేల నోటు ఇచ్చాడు. అయితే రూ.900 చిల్లర లేదని, రూ.100 నో ట్లివ్వాలని థియేటర్ సిబ్బంది చెప్పారు. చేసే ది లేక బ్లాక్‌లో రూ.150 పెట్టి కొన్నానని సు రేష్ వాపోయాడు. పండ్లు, చిరు వ్యాపారులు చిల్లర లేక బేరాలు వదులుకుంటున్నారు.
Advertisement