‘చిల్లర’ కష్టాలు | money problems in city | Sakshi
Sakshi News home page

‘చిల్లర’ కష్టాలు

Published Wed, Jan 4 2017 10:25 PM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

‘చిల్లర’ కష్టాలు

‘చిల్లర’ కష్టాలు

రెండు నెలల నుంచి నిలిచిన రూ. 100, 50, 10 నోట్ల సరఫరా
బ్యాంకుల్లో రూ. 2 వేల నోట్లు
కొన్ని ఏటీఎంలలోనే రూ.500 నోట్లు


జగిత్యాల : రద్దయిన ‘పెద్ద’నోటు.. ‘చిల్లర’ కష్టాలు తెచ్చిపెట్టింది. బ్యాంకుల్లో అవుతున్న డిపాజిట్లలో అన్నీ పెద్దనోట్లే ఉండడం.. ఆర్‌బీఐ నుంచీ కొత్త రూ. 2వేల నోట్లు మాత్రమే వస్తుండడంతో ఇటు బ్యాంకులు.. అటు ప్రజలకు చిల్లర ఇక్కట్లు తప్పడం లేదు. రూ. 2వేల పెద్దనోటు మార్కెట్లో వచ్చి రెండు నెలలు కావస్తున్నా.. దాని చెలామణి నేడూ ప్రజలకు సవాలుగా మారింది. రూ. 2వేలతో బజారుకు వెళ్తే అందులో కనీసం రూ. 500 మేర ఖరీదు చేయనిదే వ్యాపారులు సరుకులు ఇవ్వడం లేదు. దీంతో ప్రజలు అవసరం లేకున్నా.. కొనుగోళ్లు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ఇటు వ్యాపారులూ.. రూ. 2వేలకు చిల్లర ఇవ్వలేక తమ గిరాకీని కోల్పోతున్నారు.

ప్రస్తుతం ఏటీఎంలు.. బ్యాంకుల్లో అందుబాటులో లేని రూ. 500, రూ. 100, రూ. 50, రూ. 10 నోట్లు సామాన్యుడి బతుకుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. గడిచిన రెండు నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా.. రూ. 223 కోట్లు డిపాజిట్ల రూపంలో వివిధ బ్యాంకుల్లో జమా కాగా.. ఇప్పటి వరకు కేవలం రూ. 110 కోట్ల నగదు మాత్రమే ఆర్‌బిఐ నుంచి జిల్లాకు చేరింది. జరిగిన డిపాజిట్లు.. వచ్చిన నగదులో అన్నీ పెద్దనోట్లే ఉండడంతో చిల్లర కష్టాలు వచ్చిపడ్డాయి. మరోపక్క.. పాత పెద్దనోట్లు రద్దయినప్పటి నుంచి బ్యాంకులకు రూ. 100, రూ. 50, రూ. 10 కొత్తనోట్ల సరఫరాకు బ్రేక్‌పడింది. ప్రజలూ తమ వద్ద ఉన్న పెద్దనోట్లు వదిలించుకోవడంపైనే దృష్టిపెట్టారు. దీంతో బ్యాంకులు, మార్కెట్లో చిల్లర కష్టాలు వచ్చిపడ్డాయి. డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు వచ్చిన చిన్న నోట్లనే మేనేజర్లు ఖాతాదారులకు ఇస్తున్నారు. చిల్లరలేని పక్షంలో ఖాతాదారులనే సర్దుకోవాలని చెప్తున్నారు. గత నెల 31వ తేదీ వరకు కేవలం రూ. 2వేల నోటు మాత్రమే బ్యాంకుల నుంచి పంపిణీ అయ్యాయి. మొన్నటి వరకు ఏటీఎంల ద్వారా రూ. 2వేలు ఉన్న పరిమితిని రూ. 4,500కు పెంచడంతో ఈ నెల ఒకటో తేదిన రూ. 500 నోట్లు బ్యాంకులకు చేరుకున్నాయి.

ప్రస్తుతం ఈ నోటూ కేవలం ఏటీఎంలలో మాత్రమే దర్శనమిస్తోంది. బ్యాంకులకు వెళ్లిన వారికి రూ. 2వేల నోటు మాత్రమే అందుతోంది. చిల్లర కావాలంటే ఖాతాదారులే సమకూర్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బ్యాంకుల్లో మాత్రం ప్రజలకు చిల్లర కష్టాలు తప్పడం లేదు. ఇదీలావుంటే.. ఆర్‌బీఐ నుంచి అవసరం మేరకు నగదు రాకపోవడంతో జిల్లాలో ఉన్న బ్యాంకర్లు రోజుకో ఏటీఎం చొప్పున ఎంపిక చేసిన వాటిలో డబ్బులు జమా చేస్తున్నారు.

ఏటీఎంలోనే రూ. 500 నోటు..
ఆర్‌బీఐ కొత్తగా చెలామణిలోకి తెచ్చిన రూ.500 నోటు జిల్లాలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. వచ్చిన అరకొర నోట్లనే బ్యాంకర్లు సర్దుబాటు చేస్తున్నారు. బ్యాంకుల్లో రూ. 100 నోట్లు అందుబాటులో లేకపోవడం.. ఈ నెల ఒకటో తేది నుంచి ఏటీఎంల నుంచి విత్‌డ్రా పరిమితి రూ. 2వేల నుంచి రూ. 4,500లకు పెంచడంతో కొత్తగా వచ్చిన అరకొర రూ. 500 నోట్లను ఏటీఎంలలో జమా చేస్తున్నారు. కోరుట్ల, మెట్‌పల్లి వంటి పట్టణాల్లోని ఏటీఎంలలో మాత్రం రూ. 2వేలతో పాటు రూ. 500 నోట్లు ఉంటున్నాయి. జిల్లా కేంద్రంలో మాత్రం ఏటీఎంలోనూ రూ. 500 నోటు కనబడడం లేదు. రూ. 100 నోటు మాత్రమే ఏటీఎంలలో అందుబాటులో ఉంది.  

తెరుచుకోని ఏటీఎంలు..
జిల్లాలో సగానికి పైగా ఏటీఎంలు నేటికీ తెరుచుకోలేదు. పైగా మొన్నటి వరకు తెరిచి ఉన్న ఏటీఎంలు సైతం రెండ్రొజుల నుంచి తాళం వేసి కనబడుతున్నాయి. జిల్లాలో అన్ని బ్యాంకులకు సంబంధించి.. 97 ఏటీఎంలు ఉన్నాయి. వాటిలో 60 ఏటీఎంలు అసలు తెరుచుకోవడమే లేదు. తెరుచుకుంటోన్న 37 ఏటీఎంల ముందు జనం బారులు తీరడంతో గంటలోపే నగదు అయిపోతోంది. దీంతో అవి మళ్లీ మూతబడుతున్నాయి. విత్‌డ్రా పరిమితి పెంపుతో.. ఏటీఎంల ముందు జనం బారులు తీరడం, అవసరం మేరకు నగదు అందుబాటులో లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ప్రధాన పట్టణాల్లో రోజుకు రెండుకు మించి ఏటీఎంలు తెరుచుకోవడం లేదు. మంగళవారం జిల్లా కేంద్రంలో నాలుగు ఏటీఎంలు పనిచేశాయి.కోరుట్లలో రెండ్రొజుల నుంచి కేవలం గాయత్రి ఏటీఎం మాత్రమే పనిచేస్తోంది. మెట్‌పల్లిలో రోజు ఐదు ఏటీఎంలు తెరుచుకుంటుండగా.. గంటలోపే ఖాళీ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్

Advertisement
Advertisement