తెరపైకి మరిన్ని మండలాలు
Published Mon, Oct 17 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
నిజామాబాద్ అర్బన్ :
చిన్న జిల్లాలు, చిన్న మండలాల ఏర్పాటుతో అభివృద్ధి సాధ్యమన్న సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మండలాల ఏర్పాటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రెండు జిల్లాల్లో 13 మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. దీనికితోడు మరిన్ని మండలాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో వివిధ గ్రామాల ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 36 మండలాలు ఉండేవి. 19 మండలాలతో నిజామాబాద్, 17 మండలాలతో కామారెడ్డి విడిపోయాయి. కొత్తగా నిజామాబాద్‌లో 8, కామారెడ్డిలో 5 మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు
సెప్టెంబర్ 21న జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో నిజామాబాద్ జిల్లాలో కొత్తగా నిజామాబాద్ నార్త్, సౌత్, ఇందల్‌వాయి, మోపాల్, మెండోరా, ఆలూరు, రుద్రూరు, కామారెడ్డిలోని రాజంపేట, రామారెడ్డి మండలాలను పేర్కొన్నారు. గెజిట్ నోటిఫికేషన్ అనంతరం కొత్త జిల్లాలు ఏర్పాటు కాగానే ఆలూరు మినహా గెజిట్‌లో పేర్కొన్న మండలాలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు బాల్కొండ మండలంలోని ఏర్గట్ల, ముప్కాల్, కామారెడ్డి జిల్లాలోని పెద్దకొడపగల్, నరుస్రుల్లాబాద్ మండలాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో కొత్త మండలాల కోసం మరిన్ని డిమాండ్లు రావడంతో ఈనెల 9వ తేదీన జిల్లా ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపారు. కొత్తగా ఆర్మూర్ రూరల్, డొంకేశ్వర్, ఆలూరు, చందూరు, బోధన్ రూరల్, రెంజర్ల, మోస్రా, సాలూర మండలాల ఏర్పాటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతాలను మండలాలుగా ప్రకటించాలని స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. వీరి విన్నపం మేరకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
కొనసాగుతున్న ఆందోళనలు
ఆలూరు మండలం ఏర్పాటులో సందిగ్ధం ఏర్పడింది. ఆలూరు మండలం ఏర్పాటు చేసే ఆర్మూర్ మండల పరిధిలోని గ్రామాలు మండలాన్ని వ్యతిరేకించాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే ఆర్మూర్ రూరల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈయన ప్రతిపాదన మేరకు మండలాల ఏర్పాటుపై సమీక్ష కొనసాగుతోంది. మరోవైపు ఎస్సారెస్పీ ముప్పు ప్రాంతాలైన డొంకేశ్వర్, మారంపల్లి, కుద్వాన్‌పూర్, నూత్‌పల్లి గ్రామాలను కలుపుకొని డొంకేశ్వర్‌ను మండల కేంద్రం చేయాలని డిమాండ్లు వచ్చాయి. ఎంపీ కవిత దృష్టికి కూడా స్థానిక ప్రజలు డిమాండ్లు తీసుకెళ్లారు. డొంకేశ్వర్ మండల ఏర్పాటుపై కూడా పరిశీలన కొనసాగుతుంది. మరోవైపు బోధన్ మున్సిపాలిటీ కావడంతో అర్బన్ కేంద్రంగా ప్రకటించి సమీప గ్రామాల్లో బోధన్‌రూరల్ మండలంగా ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన ఉంది. బోధన్ పక్కనే ఉన్న సాలూరు గ్రామాన్ని కూడా మండల కేంద్రంగా చేయాలని స్థానికంగా డిమాండ్లు రావడంతో ప్రతిపాదనలు కొనసాగుతున్నాయి. మోస్రా, చందూరు గ్రామాల ప్రజలు మండలాల కోసం డిమాండు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపడంతో పరిశీలన కొనసాగుతోంది. త్వరలోనే మండలాల ఏర్పాటు జరిగే అవకాశం ఉంది.
Advertisement
Advertisement