అతివలకే సింహభాగం
గుడుంబా నిర్మూలనతోనే సమస్యలకు పరిష్కారం ‘సర్వోదయ’
మహిళా దినోత్సవంలో ఎంపీ దయాకర్
ఆడపిల్లలపై వివక్ష చూపొద్దు : ఎమ్మెల్యే ధర్మారెడ్డి
సంగెం(పరకాల) : పూర్వ కాలంలో వంటింటికే పరిమితమైన మహిళలకు ఇప్పుడు అన్ని రంగాల్లో సింహభాగం దక్కుతోందని.. అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ వారు దూసుకువెళ్తున్నారని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వోదయ యూత్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సోమవారం మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎంపీ దయాకర్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ వివిధ రంగాల్లో మహిళలు ప్రతిభ కనబరుస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గుడుంబా మహమ్మారి కారణంగా చిన్నవయస్సులోనే పలువురు వితంతువులుగా మారి దుర్భరజీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గుడుంబా నిర్మూలన జరిగిందని ఆయన అనగా.. ఇంకా పూర్తిగా బంద్ కాలేదని సభికుల నుంచి కొందరు చెప్పారు. దీంతో ఎంపీ స్పందిస్తూ పూర్తిస్థాయిలో నిర్మూలిస్తే మహిళల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.
మహిళలు చైతన్యవంతులైనే అభివృద్ధి
మహిళలు చైతన్యవంతులైతేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. కుటుంబ సంక్షేమంతో పాటుగా పిల్లలు, భర్త సమాజంలో రాణింపు వెనక భార్య హస్తం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రతీ ఒక్కరూ ఆడపిల్లల పట్ల వివక్షత చూపొద్దని కోరారు. గ్రామాల్లో గుడుంబా నిర్మూలన బాధ్యత పూర్తిగా మహిళలదేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పథకాలు మహిళల పేరునే మంజూరు ఇస్తున్నారని తెలిపారు. మహిళలు సంఘటితంగా ఉండి ప్రభుత్వ పథకాను సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టి సాధించాలన్నారు. మరుగుదొడ్లు తమ ఆత్మగౌరవానికి భావించి ప్రతీ ఇంట్లో నిర్మించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మహిళలకు నిర్వహించిన ఆటపోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గుగులోత్ వీరమ్మ, ఎంపీపీ బొమ్మల కట్టయ్య, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, తహశీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ భద్రునాయక్, సర్పంచ్ మల్లికాంబ, ఎంపీటీసీ సభ్యులు కళావతి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, సర్వోదయ సంస్థ కార్యదర్శి పల్లెపాడు దామోదర్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మహిళలు పాల్గొన్నారు.