తహశీల్దార్ x సీడీపీఓ
మహబూబ్నగర్(నవాబుపేట): ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు సంధించారు. ఒకరికొకరు సూచనలు చేశారు. మీరు పనితీరు మార్చుకోవాలని సూచిస్తే.. మీరే మార్చుకుని నడుచుకోవాలని మరొకరు..! ఇలా తహశీల్దార్, సీడీపీఓల మధ్య మాటలయుద్ధం సాగింది. ఇందుకు మంగళవారం మండలంలోని కారూర్‌లో జరిగిన పల్లెవికాసం కార్యక్రమం వేదికైంది. మొదట తహశీల్దార్ చెన్నకిష్టప్ప స్థానిక అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పౌష్టికాహారం పక్కదారిపడుతోందని, మీపై ఫిర్యాదులు వస్తున్నాయని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని సీడీపీఓ బాలమణిని హెచ్చరించారు.
దీంతో స్పందించిన ఆమె.. మీరూ ఓ ప్రభుత్వ అధికారే కదా! కిందిస్థాయిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. అందరిశాఖల్లో లొసుగులు మామూలే కదా అని బదులిచ్చారు. ఇద్దరి మధ్య నడిచిన ఈ తతంగాన్ని అక్కడే ఉన్న మిగతా అధికారులు, గ్రామస్తులంతా చూస్తుండి పోయారు.