కురుక్షేత్ర సభను అడ్డుకునే అర్హత సీఎంకు లేదు
గాంధీనగర్ (విజయవాడ) : నవ నిర్మాణ దీక్ష పేరుతో జాతీయ రహదారులను దిగ్బంధనం చేసి సభలను నిర్వహించిన సీఎం చంద్రబాబుకు మాదిగల కురక్షేత్ర సభను అడ్డుకునే అర్హతలేదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు అన్నారు. ఈ నెల 7న మందకృష్ణ మాదిగ నిర్వహించే కురుక్షేత్ర మహాసభకు ఏపీ ఎమ్మార్పీఎస్ మద్దతు ఇస్తుందన్నారు. నగరంలోని ఐలాపురం హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మాదిగలను అణచివేయాలని చూస్తే టీడీపీకి పతనం తప్పదన్నారు. రాష్ట్ర విభజన విషయంలో రెండు కళ్ల సిద్ధాంతం అన్న చంద్రబాబు వర్గీకరణ విషయంలో రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారన్నారు. తెలంగాణాలో టీడీపీ నాయకత్వం వర్గీకరణ చేయాలని బల్లగుద్ది చెబుతుంటే రాష్ట్రంలో మాత్రం బల్లకింద దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. మాదిగలు తమ హక్కుల సాధన కోసం సభలు, సమావేశాలు పెట్టుకుంటే సీఎం జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కురుక్షేత్ర మహాసభకు పెద్దఎత్తున మాదిగలు తరలిరావాలన్నారు. సమావేశంలో ఏమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు జెన్నీ రమణయ్య, సువర్ణరాజు, శ్రీరాం దేవమణి, విక్టోరియా, నల్లూరి శేఖర్‌బాబు, రాజా, లక్ష్మణరావు, బాబూరావు పాల్గొన్నారు.