ముచ్చుమర్రి.. ఏమార్చి!
ముచ్చుమర్రి.. ఏమార్చి!
Published Wed, Feb 15 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM
అప్రోచ్ కాలువ తవ్వింది 812 అడుగుల వరకే..
– 798 అడుగుల వరకూ నీటిని తీసుకోవచ్చంటూ ప్రకటనలు
– పొంతనలేని సీఎం వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 798 అడుగులు ఉన్నప్పుడూ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తీసుకోవచ్చు.’’ సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంగా చెప్పిన మాటలివి. అయితే ముచ్చుమర్రి సాక్షిగా ఆయన అబద్దాలు చెప్పారు. జిల్లా ప్రజలను మరోసారి వంచించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద శ్రీశైలం రిజర్వాయర్‌లోకి అప్రోచ్ కెనాల్ తవ్వింది కేవలం 812 అడుగుల వరకే. అంటే ఈ మట్టం కంటే నీరు తగ్గితే ముచ్చుమర్రి నుంచి చుక్క నీటిని కూడా తోడే అవకాశం లేదన్నమాట. వాస్తవాలు ఇలా ఉండగా.. ముచ్చుమర్రి నాకు కలలో కూడా వస్తోందని, ఇది సీమ ప్రజలకు జీవనాడి అని సీఎం అబద్దాలు వల్లె వేశారు. తమ హాయాంలోనే ముచ్చుమర్రి పూర్తయ్యిందని పేర్కొంటూ స్థానిక ఎమ్మెల్యే గొంతునొక్కింది ఇందుకేనా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద మరోసారి కర్నూలు జిల్లాపై ముఖ్యమంత్రి శీతకన్ను వేశారని అర్థమవుతోంది. ఇప్పటికే కర్నూలు జిల్లాకు స్మార్ట్ సిటీ ఇవ్వకుండా, డోన్‌లో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే మోసం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నామినేషన్‌పై పనుల అప్పగింత
వాస్తవానికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పనులను 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మొదలయ్యాయి. ఇందుకోసం బడ్జెట్‌లో నిధులను కూడా ఆయన విడుదల చేశారు. వాస్తవానికి ఇప్పుడు ఎత్తిపోతల పథకానికి అమర్చిన మోటార్లు కూడా 2008లోనే సదరు సంస్థ కొనుగోలు చేసింది. అయితే, ఈ ఎత్తిపోతల పథకం ప్రారంభం సందర్భంగా బిగించింది కూడా ఈ మోటార్లనే. ప్రధాన ఎత్తిపోతల పంప్‌హౌస్ పనులను మెగా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టింది. పంప్‌హౌస్ వరకూ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అప్రోచ్ కాలువ పనులను బెన్సా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ పనులు చేపట్టలేదనే కారణంగా సుధాకర్‌రావుకు నామినేషన్‌పై రూ.6 కోట్లకు పైగా విలువ చేసే అప్రోచ్ కాలువ పనులను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పగించారు. ఎలాంటి టెండర్ లేకుండానే ఈ పనులను అప్పగించిన ప్రభుత్వం.. తాజాగా సీఎం ప్రారంభోత్సవం సందర్భంగా కూడా పనులను బాగా చేశారంటూ మెమొంటో ఇచ్చి మరీ అభినందించారు. అయితే, వాస్తవం మాత్రం అప్రోచ్ కాలువ తవ్వింది కేవలం 812 అడుగుల వరకే. అంటే 6.147 కిలోమీటర్ల మేరకు తవ్వాల్సిన అప్రోచ్ కెనాల్‌ను పంప్‌హౌస్ నుంచి 5 కిలోమీటర్ల వరకే తవ్వారు. దీన్ని దాచిబెట్టి 798 అడుగుల వరకూ నీటిని తీసుకోవచ్చంటూ సీఎం ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది.
ఇదీ ముచ్చుమర్రి పథకం ఉద్దేశం
కర్నూలు–కడప కెనాల్(కేసీ కెనాల్) 0 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 49,440 ఎకరాల ఆయకట్టుకు అవసరమయ్యే సాగునీటి అవసరాలకు ఈ పథకాన్ని ప్రారంభించారు. శ్రీశైలం రిజర్వాయర్‌లోని బ్యాక్ వాటర్ నుంచి 5 టీఎంసీల నీటిని ఈ ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లిస్తారు. ఇందుకు దివంగత ముఖ్యమంత్రి 2007లోనే జీఓ 196 ద్వారా పరిపాలన అనుమతి ఇచ్చారు. ఈ జీఓ ఆగస్టుఽ 31, 2007లోనే జారీ అయ్యింది. ఇందుకు అనుగుణంగా ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 798 అడుగుల వరకూ నీటిని తీసుకునేందుకు వీలుగా మే 22, 2007లోనే ప్రభుత్వం మెమో (9022/మేజర్ ఇరిగేషన్4/2007–1)ను కూడా జారీచేసింది. ఈ అప్రోచ్ కెనాల్ ద్వారా 7,272 క్యూసెక్కుల నీటిని తోడుకునే అవకాశం ఉంటుంది. అయితే, ముచ్చుమర్రి నుంచి 1000 క్యూసెక్కుల నీటిని కేసీ కెనాల్(81.80 కిలోమీటర్లు)కి విడుదల చేస్తారు.
Advertisement
Advertisement