ప్రభుత్వ పరిశీలనలో కాపుల సమస్య
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనంత లక్ష్మి
మద్దతు తెలపాలని ఆమెను కోరిన ముద్రగడ, కాపు జేఏసీ
కాకినాడ రూరల్ : కాపులను బీసీల్లో చేర్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, కాపుల పట్ల టీడీపీకి ఎప్పుడూ మంచి అభిప్రాయమే ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని తప్పకుండా అమలు చేస్తారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో కలసి కాపు జాయింట్ యాక‌్షన్ కమిటీ ఎమ్మెల్యే అనంతలక్ష్మిని బుధవారం సాయంత్రం వలసపాకలలోని ఆమె క్యాంప్ కార్యాలయంలో కలిసింది. కాపుల ఉద్యమానికి మద్దతు తెలిపాలని వారు కోరడంతో ఆమె పైవిధంగా స్పందించారు. ఇప్పటికే కాపునేతలంతా ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రం అందించారని, తాను కూడా మరోసారి ప్రజాప్రతినిధులను కలిసి కాపులను బీసీల్లో కలిపే అంశాన్ని వివరిస్తున్నట్టు ముద్రగడ తెలిపారు. దీనిపై అనంతలక్ష్మి స్పందిస్తూ కాపులను బీసీల్లో కలిపేందుకు జిల్లాలోని 19 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఉన్నారన్నారు. ఈ విషయమై తామంతా కలసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పామన్నారు. మరోసారి ఎమ్మెల్యేలంతా ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.కాపు జేఏసీ ప్రతినిధులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, బస్వా ప్రభాకరరావు, జానపాముల నాగబాబులతో పాటు అనేక మంది కాపు ప్రతినిధులు ఎమ్మెల్యే అనంతలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.