'చంద్రబాబు నాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు'
కాకినాడ : దీక్ష సమయంలో తనను దారుణంగా హింసించారని కాపు సామాజిక వర్గం నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ముద్రగడ పద్మనాభం సాక్షి టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ... ఎమర్జెన్సీ ఎలా ఉంటుందో చంద్రబాబు సర్కార్ చూపించిందని తెలిపారు.
దీక్ష సమయంలో తన భార్య, కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించారని విమర్శించారు. తన చిన్న కుమారుడుని కొట్టుకుంటూ లాక్కెళ్లారని చెప్పారు. పెద్ద కుమారుడుకి ఇటీవలే వెన్నుముక ఆపరేషన్ జరిగిందని... అతడిని కూడా లాక్కెళ్లాలని చూస్తే... ఓ కానిస్టేబుల్ అడ్డుకున్నాడని ముద్రగడ తెలిపారు.
తుని ఘటనకు ముమ్మాటికీ చంద్రబాబు సర్కారే కారణమన్నారు. కాపులను ఇబ్బంది పెట్టేందుకు కుట్ర చేసి కేసుల్లో ఇరికించారని విమర్శించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాన్ని అమలు చేయమంటున్నామని ముద్రగడ స్పష్టం చేశారు. తుని ఘటనపై లోతుగా పరిశీలిస్తామని చెప్పి... మాట తప్పారని చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. తుని ఘటనపై సీబీఐ విచారణకు పట్టుబట్టొద్దని ప్రభుత్వ పెద్దలే తనని కోరారని ఈ సందర్భంగా ముద్రగడ గుర్తు చేశారు. తుని ఘటన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించినా... తనతో మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదన్నారు. తమ ఉద్యమానికి బీసీలు, దళితుల మద్దతు కూడా ఉందని ముద్రగడ తెలిపారు.
బీసీలకు నష్టం జరగకుండానే రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. తాను మంజునాథ కమిషన్పై ఆశావాహ దృక్పథంతోనే ఉన్నానని చెప్పారు. జులై చివరికల్లా సర్వే పూర్తి చేస్తారని భావిస్తున్నట్లు ముద్రగడ తెలిపారు. ఉద్యమంపై భవిష్యత్ కార్యాచరణను జేఏసీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. తమ జాతికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు.