సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన
లెనిన్ సెంటర్‌లో మున్సిపల్ కార్మికుల ధర్నా
గాంధీనగర్ :
సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఎఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం లెనిన్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు.
హామీ ఇచ్చి ఏడాది..
రంగనాయకులు మాట్లాడుతూ పర్మినెంట్ ఉద్యోగులు, కార్మికులకు సమ్మె కాలంలో ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసిందని గుర్తు చేశారు. జీపీఎఫ్ అకౌంట్‌లు నెలరోజుల్లో ప్రారంభిస్తామని హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా అతీగతీ లేదని ఎద్దేవా చేశారు. సమ్మెకాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
‘వెట్టిచాకిరీ చేయిస్తున్నారు’..
నాలుగేళ్లగా కార్మికులకు యూనిఫాం, చెప్పులు, కొబ్బరినూనె, సబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో పాటు కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్ అయిన కార్మికులకు బెనిఫిట్స్ సకాలంలో చెల్లిస్తామన్న హామీ అమలు చేయాలని కోరారు. ధర్నాలో యూనియన్ నగర అధ్యక్షుడు జెక్కి జేమ్స్, కె లక్ష్మి, నారాయణమ్మ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు .