జిల్లాను అగ్రగామిగా నిలపడమే లక్ష్యం
-
ప్రతి సోమవారం డయల్ యువర్ కలెక్టర్
-
ప్రతి శనివారం గ్రీవెన్స్ అర్జీలపై సమీక్ష
-
గ్రీవెన్స్‌డే మొక్కుబడిగా వద్దు
-
మైండ్‌సెట్ మార్చుకోండి
-
అధికారులకు కలెక్టర్ ముత్యాలరాజు పిలుపు
నెల్లూరు(పొగతోట): అన్ని రంగాల్లోను జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా శక్తివంచన లేకుండా కృషి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తన చాంబర్‌లోనూ, గ్రీవెన్స్‌హాలులోనే అధికారులతో సమీక్షలు నిర్వహించారు. టీం వర్క్‌తో అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. కొత్త కలెక్టర్ ఎలా ఉంటారో..అనే అపోహలను పక్కనపెట్టాలన్నారు. చిన్నతనంలో తాను పత్రికల్లో తన ఫొటో మొదటి పేజీలో రావాలనే లక్ష్యంతో ముందుకు సాగానని, కొంతకాలం తర్వాత సాధించానని చెప్పారు. అదేవిధంగా అధికారులందరూ జిల్లాను మొదటి స్థానంలో నిలపాలనే సంకల్పంతో విధులు నిర్వర్తిస్తే తప్పకుండా సాధించవచ్చన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తానన్నారు.
డయల్ యువర్ కలెక్టర్
ప్రతి సోమవారం డయిల్‌యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తాననిముత్యాలరాజు తెలిపారు. ఇకపై వారం వారం చేసిన అభివృద్ధి, చేయవలసిన పనులపై సమీక్షప్రతి సోమవారం జిల్లా అధికారులందరితో సమావేశం నిర్వహిస్తానని శాఖల వారీగా నివేదిక ఇవ్వాలని సూచించారు. అధికారిక కార్యకలాపాలకు సంబంధించిన ఫైళ్లలో తప్పులు లేకుండా చూసుకోవాలన్నారు. మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు అనేక కష్టాలు పడి కలెక్టరేట్‌కు వస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి అర్జీ పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రీవెన్స్‌లో వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రతి శనివారం సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. అందరూ పనితీరు మార్చుకోవాలని, వంద శాతానికి పైగా ఫలితాలు సాధించేలా సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమావేశాల్లో జేసీ–2 రాజ్‌కుమార్, డీఆర్వో మార్కండేయులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.