
చంద్రబాబు మద్దతు వల్లే హిల్లరీ ఓటమి
వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి
తిరుపతి రూరల్: తెలుగు ప్రజలకు ద్రోహం చేసిన చంద్రబాబు ఇచ్చిన మద్దతు వల్లే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఓటమి పాలయ్యారని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం సాయంత్రం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలోనే పెద్ద పెద్ద సర్వే సంస్థలు సైతం అమెరికా అధ్యక్షురాలిగా హిల్లరీ గెలుస్తారని చెప్పాయని, ప్రత్యర్ధి ట్రంప్ కూడా గెలవలేమని నిర్ణయానికి వచ్చారని తెలిపారు. హిల్లరీ గెలుపు లాంఛనమే అని భావిస్తున్న వేళ చంద్రబాబు ఆమెకు మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు.
అంతేకాకుండా అమెరికాలోని టీడీపీ శ్రేణులకు హిల్లరీకి ఓటు వేయమని లేఖలు సైతం రాశారని, అత్యుత్సాహంతో జనవరి 12వ తేది ఆమె ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతానని ప్రకటించుకున్నట్లు తెలిపారు. ఐర్హత ఉండి పింఛన్లు కొల్పోరుున వృద్ధులు పెట్టిన శాపాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులకు చేసిన అన్యాయాలతో అధికారం కోసం తెలుగు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పాపం మూటగట్టుకున్న చంద్రబాబు మద్దతు వల్లే విజయపు అంచుల్లో ఉన్న హిల్లరీ ఓటమి అగాధంలోకి పడిపోయారని ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోనూ ఓటమి తప్పదని హెచ్చరించారు.