ఎర్రగుంట్ల.. నంద్యాల రైలు నడిచేనా!
♦ రేపు జిల్లాకు రానున్న సీఆర్‌ఎస్
♦ సీఆర్‌ఎస్ ఓకే అంటే రైలు కూత మొదలు
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల నుంచి నంద్యాల వరకు రైలు మార్గం పూర్తయింది. ఇక సీఆర్‌ఎస్( కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ) పరిశీలించి ఓకే అంటే ఈ మార్గంలో రైళ్లను నడిపే ఆలోచనలో రైల్వే అధికారులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సీఆర్‌ఎస్ ఈ నెల 20వ తేదిన ఎర్రగుంట్ల- నంద్యాల రైల్వే ట్రాక్ పరిశీలనకు రానున్నట్లు తెలిసింది. ఈ రైలు మార్గాన్ని ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎర్రగుంట్ల- నంద్యాల మార్గంలో కొత్త బ్రాడ్ గేజ్ లైన్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.950 కోట్లు ఖర్చు చేయునుంది. ఈ లైన్ మధ్య ఎనిమిది రైల్వే స్టేషన్‌లు వస్తాయి. ఎర్రగుంట్ల నుంచి మొదలుపెడితే ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం, సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె, మద్దూరు స్టేషన్‌లు వస్తాయి. ఇప్పటికే ఆయా స్టేషన్‌లకు సంబంధిత సిబ్బందిని గతంలోనే నియమించారు. ఈ రైల్వేలైన్ మధ్య ప్రధాన వంతెనలు 4, మేజర్ వంతెనలు 27, చిన్న వంతెనలు 436 దాకా ఉన్నాయి.
సాధించిన ప్రగతి..
ఈ లైన్ మొత్తం 123 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అయితే ఇందులో ఎర్రగుంట్ల-నొస్సంల మధ్య 48 కిలోమీటర్లు పూర్తయింది. ఈ మార్గంలో గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. ఇక నొస్సం- బనగానపల్లె మధ్య 45 కిలోమీటర్లు ఉంది. ఈ మార్గం పూర్తయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బనగానపల్లె- నంద్యాల మధ్య సుమారు 30 కిలో మీటర్ల దాకా నిర్మాణంలో ఉంది. ఈ లైన్‌ను ఈ ఏడాది అక్టోబర్‌కు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఆ మేరకు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ రైల్వే లైన్ వల్ల లాభాలు ..
ఈ రైలు మార్గం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని కర్నూలు, కడప జిల్లాలతో అనుసంధానం చేయనుంది. అంతేకాక జిల్లాలో పుణ్యక్షేత్రాలయిన దేవుని కడప, కడప పెద్ద దర్గా, ప్రొద్దుటూ రు శ్రీ కన్యాక పరమేశ్వరీ ఆలయం, గండికోట తదితర దర్శనీయ ప్రదేశాలు దేశానికి పరిచయమవుతాయి. ఇంకా చెప్పాలంటే ఎర్రగుంట్ల, కోవెలకుంట్ల, బనగానపల్లె, సంజామల ప్రాంతాలలో సిమెంట్ పరిశ్రమల వృద్ధితో పాటు రవాణా సౌకర్యం, ఉపాధి కలుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రైల్వే లైన్‌లో త్వరగా రైలు నడిపించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాని ప్రజలు కోరుతున్నారు.