
మంత్రి అఖిలప్రియకు నోటీసులు
కర్నూలు అగ్రికల్చర్: ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.సత్యనారాయణ గురువారం నోటీసు ఇచ్చారు. ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రికకు మంత్రి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపును కాంక్షిస్తూ మాట్లాడారు. దీన్ని గమనించిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) చైర్మన్ అయిన కలెక్టర్.. ఇంటర్వ్యూను ఎందుకు పెయిడ్ న్యూస్‌గా పరిగణించరాదో చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. అలాగే నంద్యాల నియోజకవర్గంలోని లోకల్ కేబుల్ టీవీ నెట్‌వర్క్‌లకు కూడా నోటీసులు జారీ చేశారు.
తమ అనుమతి తీసుకోకుండా, ఒక పార్టీకి అనుకూలంగా కథనాలు ప్రసారం చేస్తుండటంపై ఎంసీఎంసీ స్పందించింది. అనుమతి లేకుండా ఒక పార్టీ కోసం పనిచేస్తున్నందున మీపై ఎందుకు( సీజ్ చేసేందుకు) చర్యలు తీసుకోరాదో తెలపాలని నోటీసుల్లో పేర్కొంది. నంద్యాలకు చెందిన నందికేబుల్, నంద్యాల సిటీ కేబుల్ నెట్‌వర్క్, ప్రజా కేబుల్ నెట్‌వర్క్, శిల్పా కేబుల్ నెట్ వర్క్‌లకు నోటీసులను కలెక్టర్ సత్యనారాయణ జారీ చేశారు. ప్రసారం చేస్తున్న కథనాలను పెయిడ్ న్యూస్‌గా ఎందుకు పరిగణించరాదో వివరణ ఇవ్వాలని కూడా నోటీసుల్లో ఆదేశించారు.