
పెళ్లి.. పెటాకులు కావొద్దు
►వివాహమైన ఏడాదిలోనే మనస్పర్థలు
►కోర్టు మెట్లెక్కుతున్న దంపతులు
►విచారణలో 800ల కేసులు
►భార్యాభర్తలను కలిపేందుకు
జడ్జిల ప్రయత్నం
‘హైదరాబాద్‌లో స్టాఫ్‌వేర్ ఉద్యోగం చేసే ఓ యువకుడికి ఏడాది క్రితం పెళ్లయింది. భార్య రోజూ ఫోన్‌లో మాట్లాడుతుండటంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్య అగాథం పెరిగింది. ఏడాది లోపే విడాకుల కోసం భర్త కోర్టులో కేసు వేశాడు.’ ‘తనకు నచ్చిన వస్తువులు కొనుక్కోనీయడం లేదు.. ప్రతి దానికి తల్లిని అడుగుతున్నాడు.. వేరు కాపురం పెడదామంటే ఒప్పుకోవడం లేదు.. భర్తతో ఉండలేనంటూ ఓ భార్య కోర్టులో కేసు వేసింది.’ ఇలా జిల్లాలోని ఐదు సబ్‌కోర్టులు, ఒక ఫ్యామిలీ కోర్టులో వందలాది విడాకుల కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 800 కేసులు విచారణలో ఉన్నట్లు న్యాయవాదులు పేర్కొంటున్నారు.
- జగిత్యాల జోన్
సమన్వయంతో పరిష్కరించుకోవాలి
ఆలుమగల మధ్య వచ్చే వివాదాలు పెద్దవేమీ కావు.. సమన్వయం లేకుండా, అనాలోచితం గా వాటిని ముదిరే స్థాయికి తీసుకుపోవడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.. వాటిని భార్యాభర్తలే కూర్చుని సమన్వయం తో పరిష్కరించుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావని న్యాయమూర్తులు, న్యాయవాదులు చెపుతున్నారు. ముందుగా ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోవాలి.. ఒకరి ఇష్టాఇష్టాలను మరొకరు తెలుసుకోవాలి.. అందుకు అనుగుణంగా మసలుకుంటే జీవితం ఆనందదాయకంగా మారుతుందని పేర్కొంటున్నారు. భార్య అయినా.. భర్త అయినా ఎదుటివారి లోపాలను ఎత్తిచూపే ముందు ఆ లోపాలకు తానెంత కారణమో తెలుసుకుంటే మంచిదని అంటున్నారు. ఇలా సమాలోచనతో ఉంటే భార్యభర్తలు కోర్టుమెట్లు ఎక్కకుండా సంసారంలో సరిగమలు పాడుకోవచ్చని వివరిస్తున్నారు.
జగిత్యాల కోర్టులోనే 120 కేసులు
జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, మంథని, హుజూరాబాద్ సబ్‌కోర్టులలో దాదాపు 800 వరకు విడాకుల కేసుల విచారణలో ఉన్నాయి. అందులో ఒక్క జగిత్యాల సబ్‌కోర్టులోనే 120 వరకు విడాకుల కేసులు ఉండడం గమనార్హం. ఇక కోర్టుకు రాకుండా పెద్దమనుషులు, పోలీస్‌స్టేషన్లు, నోటరీ అడ్వకేట్‌ల వద్ద ఇంతకు విడాకులు తీసుకుంటున్న వారు రెట్టింపు స్థాయిలో ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. పెద్దమనుషులు, పోలీస్‌స్టేషన్‌లలో చేసిన విడాకులకు చట్టబద్ధత లేకపోవడంతో బయట రాజీ కుదుర్చుకుని విడాకుల కోసం కోర్టుకు వచ్చేవారి సంఖ్య ఇటీవల పెరిగింది. అయితే ఈ కేసులను విచారించే జడ్జిలు వెంటనే విడాకులు మంజూరు చేయకుండా భార్యాభర్తల మధ్య ఉన్న అపోహలను పోగొట్టి వారు కలిసి బతికేలా ప్రయత్నిస్తున్నారు. చదువుకున్న భార్యాభర్తలకు, పిల్లలు ఉండి విడిపోవాలనుకుంటున్నవారికి స్వయంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కేసు పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమనుకుంటే తప్ప విడాకులకు అనుమతి ఇవ్వడంలేదు.
అపనమ్మకం..
‘మాంగళ్యం తంతునాం.. మహజీవన హేతునాం’ అంటూ మూడుముళ్లతో ఏడడుగులు నడిచి ఒక్కటవుతున్న దంపతులు మూణాళ్లకే ఎడ ముఖం, పెడముఖంగా ఉంటున్నారు. ఏడాదిలోపే విడాకుల కోసం కోర్టులు, పోలీస్‌స్టేషన్‌ల చుట్టూ తిరగడం ఇటీవల పరిపాటిగా మారింది. భార్యాభర్తల మధ్య పెరుగుతున్న అపనమ్మకాలు, ఆధిపత్య పోరు వంటి కారణాలు అనురాగాలు, అప్యాయతలు దూరం చేస్తున్నాయి. పచ్చని కాపురాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి.
విడిపోయే ఆలోచనే చేయొద్దు
భార్యాభర్తలు ఏ సమస్య వచ్చినా విడిపోయే దిశలో అసలు ఆలోచించనేవద్దు. సమస్యలను, లోటుపాట్లను సరిదిద్దుకోవాలే కానీ తెగేదాకా లాగి విడిపోవడం మంచిది కాదు. కూర్చుని మాట్లాడుకుంటే ఎంతటి సమస్య అయినా తీరిపోతుంది.
- తాండ్ర సురేందర్,
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, జగిత్యాల
సమస్యలు నీటి బుడగలు
భార్యాభర్తల మధ్య ఏర్పడే సమస్యలు నీటి బుడగల్లాంటివి. అవి అలా వచ్చి ఇలా వెళతారుు. వాటిని పెద్దగా చేసి తెగే వరకు లాగవద్దు. ఏ సమస్య ఉన్నా ముందుగా దంపతులిద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. అవసరమైతేనే తల్లితండ్రుల వరకు వెళ్లాలి.
- డబ్బు లక్ష్మారెడ్డి, సీనియర్ న్యాయవాది, జగిత్యాల